శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారసభ కోసం విశాఖ వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఏపీకి రెండో సారి మోడీ వస్తున్నారు. గుంటూరుకు వచ్చే సమయంలో.. వివిథ పార్టీలు, ప్రజాసంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం విశాఖలోనూ అదే పరిస్థితి ఉంది. ఏయూ గ్రౌండ్లో సభ నిర్వహించాలనుకున్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైల్వే గ్రౌండ్‌కు మార్చారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. టీడీపీతో పాటు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోజు రోజుకు నిరసనలు ఉద్ధృతి పెంచుకుంటూ పోతున్నారు. కొన్ని సంఘాలు నిరహార దీక్షలు కూడా చేపట్టాయి.
టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నిరసన కార్యక్రమాలను ముందు ఉండి నడిపిస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ జోన్ ప్రకటన వారిని సంతృప్తి పరచలేకపోయింది. కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని .. నిరసనలు ఆపేది లేదని ప్రకటించాయి. మోడీకి నిజంగా చిత్తశుధ్ది ఉంటే.,. కిరండోల్ లైన్, శ్రీకాకుళం, విజయనగరం రైల్వే లైన్లను ఒరిస్సాలోని రాయగడలో ఎందుకు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. మోడీ టూర్ అయిపోయిన తర్వాత కూడా.. ఆందోళన కొనసాగిస్తామని.. ప్రజాసంఘాలు చెబుతున్నాయి. రైల్వేజోన్ ప్రకటించారు కాబట్టి బీజేపీ నేతలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. చెప్పుకోవడానికి ఒక అస్త్రం దోరికిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రైల్వే జోన్ పేరు చెప్పి.. కొంత జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉత్తరాంధ్రలో బీజేపీకి అంతంతమాత్రం క్యాడర్ ఉండటంతో వారికి వైసీపీ నేతలు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఖాళీ కుర్చీలు కనిపించకుండా.. ఉంటే చాలన్న రీతిలో బీజేపీ నేతలు.. ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ప్రధాని రైల్వే జోన్ ను.. విశాఖలో ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చినందున.. ఢిల్లీలో ప్రకటించారు. ఎన్ని ప్రకటించినప్పటికి ఇది కలిసి వస్తుందనే నమ్మకం లేదని బీజేపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.