రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వారికి మోడీ బలం బీజేపీ కాదు విపక్షాలేనన్న అంశంపై ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ పక్షాలకు ఉన్న ఓట్లు కంటే ఎక్కువే పోల్ అయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మద్దతుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేసినట్లుగా కౌంటింగ్‌ను బట్టి తెలుస్తోంది. అంటే విపక్ష పార్టీల ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి తృణమూల్ కాంగ్రెస్ హ్యాండిచ్చేసింది.
అంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా… సరే జాతీయంగా బీజేపీతో వ్యతిరేక పోరాటం చేయడానికిసిద్ధంగా లేదని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ, కేసీఆర్ వంటి వారికి .. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఉంది కాబట్టి ఎదుర్కోక తప్పదు. లేకపోతే బీజేపీ ఆయా పార్టీలను మింగేస్తుంది. ఆ పరిస్థితి ఆ పార్టీలే తెచ్చుకున్నాయన్న విషయం తర్వాత సంగతి. కానీ ఇప్పటికైతే విపక్షాల్లో బీజేపీకి ఎదురొడ్డి నిలిచే పార్టీ లేకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాను రాను దారుణంగా మారుతోంది. ఇతర పార్టీలు బీజేపీకి సామంతులుగా ఉంటున్నాయి. పోరాడుతున్న ఒకటి రెండు పార్టీలకు గత్యంతరం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మోదీకి ఎదురుందన భావించడం లేదు. మోదీని ఎదుర్కోగల సమర్థుడైన నేత లేనప్పుడు…ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రయోజనం ఉండదు. ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తేనే ఓటేస్తారు. లేకపోతే.. వాతలు పెట్టిన వారికి ఎదురెళ్లి గండం తెచ్చుకోవాలని అనుకోరు. ఇప్పుడు దేశ ప్రజలది అదేపరిస్థితి. అందుకే మోదీకి బలం విపక్షాలేనని అనుకోవాల్సిన పరిస్థితి.