మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. ఎందుకంటే నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు మద్దతిచ్చి గెలిపించినందుకట. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా మాత్రం భీమవరంను ప్రకటించింది. దీంతో గగ్గోలు ప్రారంభమయింది. ఎలా చూసినా నర్సాపురం జిల్లా కేంద్రమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది. బ్రిటిష్, డచ్ హయాం నుంచి సబ్ డివిజన్‌గా ఉన్న నరసాపురం పట్టణాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పెద్దగా పట్టించుకోవడం లేదు.
దీంతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు యాక్టివ్‌గా తీసుకుని ఉద్యమం నడుపుతున్నారు. అందర్నీ కలుపుకుని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అభ్యంతరాల పరిశీలన గడువు కూడా పూర్తవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. దీంతో బుధవారం నర్సాపురంలో పెద్ద ర్యాలీ నిర్వహించిన ఆయన సభ పెట్టి..తనచెప్పుతో తాను కొట్టుకున్నారు. ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశానన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురంలో బలమైన నేత. చంద్రబాబు మొదటి కేబినెట్లో కీలక మంత్రిగా పని చేశారు. కానీ తర్వాత పార్టీలు మారి ఎవరికీ కాకుండా పోయారు.పీఆర్పీకి వెళ్లారు. మళ్లీ వైసీపీకి వెళ్లారు.
మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీలోకి వచ్చారు. చంద్రబాబు పార్టీలు మారాడని మనసులో పెట్టుకోకుండా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.అయితే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని మళ్లీ వైసీపీలో చేరి వైసీపీ అభ్యర్థి ప్రసాదరాజుకు మద్దతు పలికారు. ఎన్నికల తర్వాత కొత్తపల్లిని పట్టించుకునేవారే లేరు. ఇప్పుడు తన చెప్పుతో తాను కొట్టుకుని మరోసారి వార్తల్లోకి వచ్చారు. కానీ ఆయన రాజకీయ జీవితం ఏపార్టీకి కాకుండా పోయిందని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు.