దేశ ప్రజలకు ఇప్పుడు ఏది ముఖ్యమైనది…? ఏ సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు..? ఆ సమాచారం కోసం ఏ టీవీల్ని చూస్తున్నారు..? లాంటివన్నీ పరిశీలిస్తే.. ప్రస్తుతం న్యూస్ ట్రెండ్ తెలిసిపోతుంది. రిపబ్లిక్ టీవీ సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి.. తమ చానల్‌కు పోస్టర్‌బాయ్‌గా మార్చేసుకుంది. ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసింది.అనేక మంది పేర్లను బయట పెడుతోంది. రిపబ్లిక్ టీవీ చానల్ రిపోర్టర్లు.. పబ్లిక్‌లో.. గంతులేస్తూ… చిందులేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వారు ఇలా చేయడానికి తగ్గ ఫలితం పొందారు. దేశంలో ఇప్పుడు అత్యధిక మంది చూస్తున్న ఇంగ్లిష్ న్యూస్ చానల్ రిపబ్లిక్ టీవీనే.
ఇంగ్లిష్ న్యూస్ చానళ్ల రేటింగ్‌ల్లో 48 శాతం రిపబ్లిక్ టీవీకే వచ్చినట్లుగా బార్క్ ప్రకటించేసింది. ఆ తర్వాత టైమ్స్ నౌ ఎక్కడో దూరంగా 18 శాతం , ఇండియా టుడే పదిహేను శాతం, న్యూస్ 18 14 శాతం, ఎన్డీటీవీ 3 శాతం వ్యూయర్ షిప్‌ను దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే.. ఆయన దేశానికి చేసిన సేవల్ని గుర్తించడానికి రిపబ్లిక్ టీవీకి సమయం దొరకలేదు. అంతగా సుషాంత్ కేసులో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎవరెవరికి ఎన్సీబీ అధికారులు నోటీసులిస్తారో ముందే చెప్పేవారు.. విచిత్రంగా వారు ప్రకటించిన పేర్లకే నోటీసులు వెళ్లేవి. వారే సీక్రెట్ వాట్సాప్ చాట్లను బయటకు వెల్లడించేవారు. ఇలా అనేక అసాధ్యాలను అద్భుతం చేసి… సుశాంత్ కేసును ఇన్వెస్టిగేట్ చేసింది రిపబ్లిక్ టీవీ.
ఈ విజయం రిపబ్లిక్ టీవీది కాదు. ప్రజలదే. దేశంలో చాలా సమస్యలు ఉన్నా.. సుషాంత్ కేసు కోసం.. అదే పనిగా చూడబట్టే.. రిపబ్లిక్ టీవీ ఈ ఘనత సాధించింది. ప్రజల అభిరుచి మేరకే వార్తలివ్వాలని ఇతర చానళ్లు కూడా… రిపబ్లిక్ టీవీని అనుసరించండం ప్రారంభించాయి. కానీ అనుకరణ.. ఎప్పటికీ అనుకరణే. అందుకే.. రిపబ్లిక్ టీవీ దరి దాపుల్లోకి రాలేకపోయాయి. ఇప్పుడు.. న్యూస్ చానళ్లు అంటే అజెండా మారిపోయింది. ప్రజా సమస్యలు.. ప్రభుత్వాల తప్పులు బయటపెట్టడంలాంటివి కాదు.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవడం.. కావాల్సినన్ని రేటింగ్స్ సాధించడం.