ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం కాంగ్రెస్ , బీజేపీ మంతనాలు జరుపుతున్నాయి. ఆయన కూడా ఈ నెలలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ టీం వచ్చి ఆయనతో చర్చలు జరిపింది. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును కూడా చేర్చుకోవడానికి చర్చలు ప్రారంభించారు. అనుచరులందరికీ టికెట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని పొంగులేటి వారికి హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. బీజేపీ తాము ఇస్తామని కబురు పంపింది. ఇంకా పొంగులేటి నిర్ణయం తీసుకోలేదు.
జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డీకే అరుణతో ఆయనకు విభేదాలుండేవి. బీఆర్ఎస్ నుంచి జూపల్లిని సస్పెండ్ చేయడంతో డీకే అరుణనే స్వయంగా ఫోన్‌చేసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అందరం కలిస్తే కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ నుంచి జూపల్లికి ఒత్తిడి వస్తోంది. కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యం కాంగ్రెస్‌లో చేరితేనే నెరవేరుతుందని, ఈ టైంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హస్తం నేతలు సూచిస్తున్నారు.
ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలే జూపల్లితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీకి చెందిన ఢిల్లీ నేతలు సైతం వీరిద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంపై సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్లద్దరు ఏ పార్టీలో చేరితే రానున్న రోజుల్లో ఆ పార్టీలోకే మిగతా నేతల వలసలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల కేంద్ర నాయకత్వాలు పొంగులేటి, జూపల్లిని ఆకర్షించడంపై సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాయి. . పొంగులేటి, జూపల్లికి ప్రజాబలం ఉండటంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతోనే రెండు పార్టీలు వారిని చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.