కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ రాష్ట్రంలో అయినా పార్టీలకు ఓటు బ్యాంకులే. పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి ఓట్లేయించుకుంటూ ఉంటారు. కానీ చేయలేరు. ఏపీలో జగన్… తెలంగాణలో కేసీఆర్ చేసింది అదే. అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ అని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఆ దిశగా ఒక్క అడుగు వేయలేదు. ఇటీవల కేసీఆర్ ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ అని ప్రకటించారు కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ.. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం ఒక్క సంతకంతో 57వేల మందిని రెగ్యూలరైజ్ చేసేసింది.
అంతే కాదు కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిని శాశ్వతంగా రద్దు చేస్తూ ఒరిస్సా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇవాల్టికి కూడా చాలా రాష్ట్రాల్లో రెగ్యులర్ రిక్రూట్మెంట్లు లేవు. కాంట్రాక్టు పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానీ ఒడిశాలో మాత్రం కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్కు చరమగీతం పాడేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం ద్వారా 57,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు.. ఇందుకు ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో ముందుగానే దీపావళి వచ్చినట్టయింది.
నవీన్ పట్నాయక్ నిర్ణయంతో… జగన్, కేసీఆర్‌లపై ఒత్తిడి పెరగనుంది. కేసీఆర్ కూడా అధికారికంగా ప్రకటించారు కాబట్టి… ఇరవై వేల మందిని పర్మినెంట్ చేయక తప్పదు. ఎన్నికలకు ముందు చేస్తారా ఈ లోపే చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక నిరుద్యోగుల్ని నిండా ముంచినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న జగన్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. గెలుస్తామన్న నమ్మకం లేకపోతే..ఎన్నికల కు ముందు సంతకం చేస్తారని.. తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ బాధలన్నీ పడేలా చేస్తారని అంటున్నారు