ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు చుక్కలు చూపిస్తోంది. అనూహ్యంగా కుంగిపోయిన ప్రాజెక్టును మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం అంత తేలిక కాదని.. కేంద్ర డ్యాం సేఫ్టీ అధారిటీ స్పష్టం చేసింది. 43 పేజీల నివేదికను ఈ మేరకు విడుదల చేసిది. ప్లానింగ్, డిజైన్, క్వాలటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటినెన్స్.. మొత్తం ఈ నాలుగు విషయాల్లో వైఫల్యం చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రిట్ కూడా తొలగిపోయిందని,స్పష్టం చేసింది.
బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ,.ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్‌ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిదని.. తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది. కీలకమైన వివరాలు ముఖ్యంగా వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ హెచ్చరించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపైనా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే పరిస్థితిలో వచ్చే అవకాశం ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన అన్నారం, సుందిళ్లను తనిఖీ చేయాల్సి ఉందని డ్యామ్ సేఫ్టీ స్పష్టం చేసింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అన్నట్లుగా కమిటీ నివేదిక ఇచ్చింది. పైగా కేసీఆర్ దీనికి కర్త, కర్మ, క్రియ ఆయనే రీ డిజైన్ చేశారు. ఇప్పుడు బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.