నందమూరి కళ్యాణ్ రామ్ కు పటాస్ తో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో సుప్రీం సినిమా చేస్తున్నాడు. తన సినిమాల్లో ఓ సెంటిమెంట్ ను మాత్రం ఫాలో అవుతున్నాడు దర్శకుడు అనీల్. ఇంతకీ ఈ దర్శకుడు ఫాలో అయ్యే సెంటిమెంట్ ఏంటంటే సినిమాలో పోలీస్ క్యారక్టర్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడమే. పటాస్ తో ఏకంగా హీరోతో పోలీస్ పాత్ర వేయించి ఎంటర్టైన్ చేసిన అనీల్ ప్రస్తుతం తీస్తున్న సుప్రీం లో హీరోయిన్ రాశి ఖన్నా చేత పోలీస్ క్యారక్టర్ వేయిస్తున్నాడు.
దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదే కాకుండా నందమూరి నట సింహం బాలయ్యకు కూడా ఓ పవర్ ఫుల్ కథని వినిపించాడట అనీల్. అయితే విశేషం ఏంటంటే ఆ సినిమా కథలో కూడా హీరో పోలీసేనట. పటాస్ తో తన టేకింగ్ నచ్చిన బాలయ్య అనీల్ కు స్టోరీ డెవలప్ చేసుకు రమ్మని చెప్పాడట.
ఒకప్పుడు పూరి ఇలా తన ప్రతి సినిమాలో హీరోని పోలీస్ గా చూపించి ట్రెండ్ కొనసాగించాడు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను అనీల్ ఫాలో అవుతున్నాడు. మరి ఇది సెంటిమెంట్ అని మనం అనుకున్నా యాదృచ్చికంగా అలా జరుగుతుంది అన్న భావన కలుగవచ్చు. ఏది ఏమైనా అనీల్ ఈ సుప్రీం సినిమా కూడా హిట్ కొడితే ఈ సెంటిమెంట్ మరి బలంగా మారే అవకాశం ఉంది.