భారతీయ జనతా పార్టీ విజయధాటిని తట్టుకోలేని అభద్రతలో సీఎం కేసీఆర్ ఉన్నారంటూ విమర్శించారు భాజపా నేత లక్ష్మణ్. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యామ్నాయం వస్తుందనీ, నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిస్పందిస్తూ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అభద్రతలోంచి పుట్టిందే ఫ్రెంట్ ఆలోచన అనీ, టెంటులేని ఫ్రెంటులకు ఆయన నాయకత్వం వహిస్తామనడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. మోడీ హవా తెలంగాణను తాకడం ఖాయమనే విషయం కేసీఆర్ కు అర్థమైపోయిందనీ, అందుకే ఓటమి ఛాయల్లో ఉన్న పార్టీలను ఒక టెంటు కిందకి తీసుకొచ్చి ఫ్రెంట్ చేస్తామంటున్నారన్నారు. దేశ ప్రజలు ఇలాంటి ఫ్రెంట్లు చాలా చూశారనీ, అవన్నీ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయాయన్నారు.
నాలుగేళ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయి, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆశా కిరణంగా ఈశాన్య భారత ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. భాజపా వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా గుణాత్మక మార్పులని కేసీఆర్ హితబోధ చేస్తున్నారనీ, తెలంగాణలో ఆయన చేసిన మార్పులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన వారు వ్యవస్థలో మార్పుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. యాభయ్యేళ్లుగా కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాల్లో కేసీఆర్ పాత్ర లేదా అని నిలదీశారు. ఆయన సగం రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే సాగింది కదా అని అన్నారు.
రైతుల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణలో అన్నదాతలకు బేడీలు వేయించారన్నారు. నేరెళ్లలో దళితులు చేసిన తప్పేంటనీ, ఇసుక మాఫియా వల్ల అమాయకులు చనిపోతున్నారని నిలదీస్తే, చిత్రహింసలు పెట్టి జైలుకి పంపిన ఉదంతాన్ని గుణాత్మకమైన మార్పుగా చూడాలా అని నిలదీశారు. వాస్తవాలను పత్రికలు రాస్తే సహించలేరు, ప్రభుత్వాన్ని నాయకులు ప్రశ్నిస్తే తట్టుకోలేరు.. ఇదేనా గుణాత్మకమైన మార్పంటే అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇలా.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భాజపా నేత కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు ఓరకంగా ఇది గట్టి కౌంటరే. ఏదో విమర్శించాలన్న ఉద్దేశంతో కాకుండా.. సరైన పాయింట్లతో లక్ష్మణ్ తిప్పికొట్టారు. అయితే, తెలంగాణలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు చూస్తున్నారని చెప్పడం… కాస్త సత్యదూరంగానే ఉందని చెప్పాలి. ప్రత్యామ్నాయంగా ఎదిగే క్రమంలో తాము కష్టపడుతున్నాం అని ఉంటే వాస్తవ పరిస్థితికి సరిపోయేది. భాజపా కౌంటర్ అయిపోయింది.. ఇక, తెరాస నుంచి ఎవరు మైకు అందుకుంటారో చూడాలి.