అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ క్యాపిటల్ అభివృద్ధి కోసం సింగపూర్‌తో మరోసారి చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుపై గతంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యాన కన్సార్టియం ముందుకు వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసింది. సింగపూర్ వెళ్లి ఒప్పందంపై విచారణ కూడా చేయడంతో సింగపూర్ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు మరోసారి సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారు. రాజధానిలోని అత్యంత కీలక ప్రదేశంలో, కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రోడ్డు- గవర్నమెంట్ కాంప్లెక్స్‌లకు సమీపాన సీడ్ క్యాపిటల్ కోసం 1691 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంస్థలను ఇక్కడికి రప్పించి ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా చేయాలన్నది లక్ష్యం. దీని వల్ల రాజధాని ఆదాయం పెరగడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Also Read : అమరావతికి అప్పు వద్దు : మిథున్ రెడ్డి
భూములను ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి పరచి, మంచి ధరలకు విక్రయించే బాధ్యత కూడా స్టార్టప్ ఏరియా డెవలపర్‌దే. ఈ రూపంలో లభించే ఆదాయంలో 42 శాతాన్ని సింగపూర్ కన్సార్షియం సీఆర్డీఏకు ఇస్తుంది. స్టార్టప్ ఏరియా రాకతో ఒక్క అందులోనే కాకుండా అమరావతి వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటి వరకు సింగపూర్ సంస్ధలు 40 దేశాల్లో స్టార్ట్ అప్ ఎరియాలను అభివృద్ది చేశాయి. గొప్ప అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం నేలపాలు చేయడంతో… ఇప్పుడు సింగపూర్ సంస్థలు ఆసక్తి చూపిస్తాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.