పోలీసులంటే ఎవరైనా వెంకటేష్ ఘర్షణ రేంజ్ ఆలోచనలు చేస్తారు జనం. కానీ ఏపీలో మాత్రం అలీబాబా అరడజన్ దొంగలులో రాజేంద్రప్రసాద్ తరహాలో కథలు చెబుతున్నారు. ఆ కథలు వింటే.. వీళ్ల కన్నా దొంగలే కాస్త నమ్మేటట్లు చెబుతారే అని అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పోలీసులు చెప్పే కథలు ఏ మాత్రం నమ్మశక్యంగా ఉండంవు. ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి. వీళ్లు పోలీసులా లేకపోతే నేరస్తులతో కుమ్మక్కయి.. అసలేం జరగలేదని చెప్పడానికో… లేకపోతే చిన్నా చితకా కేసులు పెట్టి వాళ్లను మళ్లీ జనం మీద పంపడానికి ఉద్యోగాలు చేస్తున్న వారో అర్థం కాని పరిస్థితి. విశాఖ కిడ్నాప్ కేసు.. ఒంగోలులో ఆనం రామనారాయణరెడ్డి ఎటాక్ కేసుల్లో పోలీసులు చెప్పి న కథలు తెలిస్తే… వీళ్లా పోలీసులు అనుకోక తప్పదు.
విశాఖ కిడ్నాప్ కేసులో పోలీసులు చెప్పింది ఎవరైనా నమ్ముతారా ?
డబ్బు కోసమే కిడ్నాపర్లు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. 48 గంటల పాటు నిర్బంధంలో ఉంచుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. వాళ్లను ఎక్కడికో తీసుకెళ్తూంటే.. ఫోన్ లోకేషన్ ట్రాక్ చేసి పట్టుకున్నాం.. ఇదీ పోలీసులు చెప్పిన కథ. చివరికి చెప్పిదేమిటంటే.. . ఆ ట్రాక్ చేసిన ఫోన్ .. వీరు నిందితుల్ని పట్టుకున్న వద్ద లేదు. వారెక్కడో దిగిపోయారు. మరి ఫోన్ ఎలా ట్రాక్ చేశారో వారికే తెలియాలి. ఇదే పెద్ద లూప్ హోల్ అనుకుంటే.. అసలు ఎలాంటి సీసీ కెమెరా సాక్ష్యాలు లేవు..అసలు తెర వెనుక ఏం జరగలేదు.. డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని గట్టిగా వాదించేస్తున్నారు. స్వయంగా సీపీ త్రివిక్రమ వర్మనే ఇలా చెప్పడం చూసి.. పాపం పోలీసు కష్టాలని ఎవరికైనా అనుకోక తప్పదు.
ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చిన్న విషయమా ?
రాష్ట్రంలో ఓ మామూలు ప్రజాప్రతినిధి.. అది వైసీపీ నాయకుడు అయితే ఏస్థాయిలో దందాలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఇక భూ వివాదాలనే కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎంవీవీ గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి.. పైగా ఎంపీ .. ఆయన ఆడిటర్ ను 48 గంటల పాటునిర్బంధంలో ఉంచుకుంటే ఎవరికీ తెలియదా ? ఎవర్ని నమ్మించాలనుకుంటున్నారు ? . ఈ మొత్తం వ్యవహరంలో చాలా పెద్ద కథ ఉందని.. దాన్ని పోలీసులు దాచేస్తున్నారని అందరికీ తెలుసు.
నెల్లూరు ఆనంపై దాడి.. క్రేజ్ పెంచుకునేందుకట !
అదే సమయంలో నెల్లూరు పోలీసులు మరో కథ చెప్పారు. ఆనంపై దాడి చేయడానికి ఆయన ఇంటిపైకి వెళ్లి నవారికి ఎలాంటి ఉద్దేశాలు లేవట.. కేవలం క్రేజ్ పెంచుకునేందుకు ఆయనపై దాడి చేయాలనుకున్నారట. ఇదేమీ పెద్ద నేరం కాదని.. ఆ నిందితులకు నోటీసులు ఇచ్చి పంపేశారు. ఆనంపై దాడి చేయడానికి వాళ్లను ఎవరూ ప్రేరేపించలేదని.. రాజకీయ కోణం లేదని పోలీసులు చెబుతున్నారు. దాడులు చేసిన తర్వాత మా పార్టీ కార్యకర్తలకు బీపీలు వచ్చాయని చెప్పిన పాలకులు ఉన్న రాష్ట్రంలో దాడి విఫలమైతే.. . ఇలా క్రేజ్ కోసమే చేశారని చెప్పి… ఏ కేసూ లేకుండా వదిలేసే రాజ్యంగాన్ని అమలు చేస్తారేమో.
పోలీసులు అంటే ప్రజల్లో ఓ రకమైన రెస్పెక్ట్ ఉండేది. కానీ గత నాలుగేళ్లుగా పోలీసులంటే నేరస్తుల్ని కాపాడి బాధితుల్ని వేధించే వారిగా ముద్రపడిపోయింది. వారి వారి స్వయంకృతం. ఇలా చేసుకుని .. వ్యవస్థను నాశనం చేసుకుని… వారు తాము వేసుకున్న డ్రెస్‌కు ఏం న్యాయం చేసినట్లు ?