నెల్లూరులో వైసీపీ నేత అనే వ్యక్తి కనిపించడం లేదు. అధికారంలో ఉన్నంత కాలం పెత్తనం చెలాయించిన వారు ఇప్పుడు నోరు మెదపడం లేదు. కనీసం బయటకు రావడం లేదు. నెల్లూరులో అసలు వైసీపీ ఉందా అని అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. 2019లో పది కి పది స్థానాలు గెల్చుకున్నారు. కానీ గత ఎన్నికల్లో పదికి పది ఓడిపోయారు. అప్పట్లో అలా గెలవడంతో వచ్చిన అహంకారం వల్లే.. తర్వాత మొత్తం కోల్పోయారు.
నెల్లూరులో వైసీపీకి బలమైన నేతలుఉండేవారు. మేకపాటి, ఆనం, అనిల్ కుమార్, కాకాణి, సర్వేపల్లి, వేమిరెడ్డి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ సీనియర్లు ఉండేవారు. కానీ జగన్ రాజకీయాలతో చాలా మంది ఒక్కొక్కరుగా దూరమయ్యారు. మోనార్క్లుగా వ్యవహరించి పార్టీని భ్రష్టుపట్టించిన వారు అక్కడే ఉన్నారు. అంటే పార్టీలో ఉన్నారు కానీ బయటకు రావడం లేదు. అనిల్ కుమార్ కు ఎక్కడ రాజకీయం చేయాలో ఇంకా హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు.
వేమిరెడ్డి , ఆనం టీడీపీలో చేరిపోయారు. మేకపాటి కుటుంబం పూర్తిగా డిటాచ్ అయిపోతోంది. పెద్ద మేకపాటికి వయసు అయిపోతోంది. విక్రమ్ రెడ్డి రాజకీయాల్ని అందుకోలేకపోతున్నారు. కుటుంబంలో చీలికలు రావడంతో ఆయన కూడా హు,ారుగా లేరు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి బయటకు అడుగు పెట్టాలంటే కేసుల భయం వెంటాడుతోంది. గతంలోలా ఈ సారి వదిలి పెట్టరని వీలైనంత వరకూ నోరు కట్టేసుకుని ఉంటున్నారు. మొత్తంగా నెల్లూరులో వైసీపీ ఉనికి సమస్యల్లో పడిపోయింది.