మొత్తానికి జగన్ తను అనుకున్నట్టుగానే మూడు రాజధానులు బిల్లు ని గవర్నర్ తో ఆమోదింపజేయించుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చేశారు. దీనిపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వస్తోంది. వైజాగ్ , కర్నూలు తదితర ప్రాంతాల ప్రజలు వికేంద్రీకరణ మంచిదేనని అభిప్రాయపడుతుంటే అమరావతి రైతులు, టిడిపి అనుకూలురు జగన్ నిర్ణయం పై మండి పడుతున్నారు. ఇలా టిడిపి వైఎస్ఆర్సిపి ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ అమరావతి పై సమాధానం చెప్పాలంటూ గంటల తరబడి డిబేట్ లు పెట్టింది. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఆ కథనాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో నెటిజన్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వైఖరిని తప్పుపడుతూ ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
అమరావతి పెట్టింది చంద్రబాబు, మార్చింది జగన్ అయితే పవన్ ఎందుకు సమాధానం చెప్పాలి అన్న జనసైనికులు:
2014 ఎన్నికలలో చంద్రబాబు గెలవడానికి ప్రధాన కారణం, విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కు అంతకుమించిన రాజధానిని ఆయన తన దార్శనికత తో ఐదేళ్లలో పూర్తి చేస్తాడు అన్న ప్రజల నమ్మకం. మొదటి రెండేళ్లపాటు చంద్రబాబు అమరావతి పై ప్రజలకు ప్రదర్శించిన డిజైన్లను, బ్లూప్రింట్ లని అభినందించిన జనాలు, ఆ తర్వాత చంద్రబాబు తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వత భవనాలను ప్రారంభించడం లేదని గ్రాఫిక్స్ లో చూపిస్తున్న బ్లూ ప్రింట్స్ వాస్తవ రూపం దాల్చడం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. అయిదేళ్లపాటు పాలనలో చంద్రబాబు రాజధానిని కనీసం ఒక మోస్తరుగా కూడా పూర్తి చేయకపోవడంతో, ఆ అసహనం నుండి వచ్చిన వ్యతిరేక భావన ఎన్నికల్లో కూడా ప్రతిబింబించింది. ఐదేళ్ళలో అమరావతిని పూర్తి చేయలేక పోవడం, కేవలం ఒక వర్గం వారికి మాత్రమే అమరావతి ప్రయోజనాలు చేకూరుస్తుంది అన్న ఆరోపణలను తిప్పి కొట్ట లేకపోవడం, అభివృద్ధి మొత్తం కేవలం అమరావతి లో కేంద్రీకృతం అవుతే తమ ప్రాంతాలు అన్యాయం అవుతాయి అన్న ఇతర ప్రాంతాల మనోభావాలను సరైన రీతిలో అడ్రస్ చేయలేకపోవడం చంద్రబాబు తరఫున జరిగిన పొరపాట్లు.
అయితే జగన్ తరఫున జరిగిన పొరపాటు ఏమిటంటే, ఎన్నికల ముందు కనీసం మాట మాత్రంగానైనా వికేంద్రీకరణ గురించి, మూడు రాజధానులు గురించి మాట్లాడకుండా ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోవడం, పైగా అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఆర్కె లాంటివారు జగన్ వచ్చినా అమరావతికి ఢోకా ఉండదంటూ అక్కడి ప్రజలను ఒప్పించడం . దీంతో ఎన్నికల తర్వాత జగన్ మూడు రాజధానులు ప్రకటించగానే అమరావతి రాజధాని కి రైతు ఇచ్చిన రైతుల లోనే కాకుండా అమరావతి ప్రాంతంలో మొత్తంగా విస్మయం వ్యక్తమైంది.
2015 లోనే హెచ్చరించిన పవన్, అప్పట్లో పవన్ దిష్టిబొమ్మలు తగలబెడతాం అన్న అమరావతి రైతులు :
2015లో అమరావతి రాజధాని కోసం భూ సమీకరణ జరుగుతున్న సమయంలో కొంతమంది రైతులు తమ భూములు ఇవ్వలేమని ప్రకటించినప్పుడు ప్రభుత్వం వారితో బలవంతంగా భూములు తీసుకునే ప్రయత్నం చేస్తే రైతుల పక్షాన పవన్‌కళ్యాణ్ నిలబడ్డారు. రైతులు ఇష్టపూర్వకంగా ఇస్తేనే భూములు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని, మూడు వేల ఎకరాల తో రాజధాని నిర్మించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా, ఇంత పెద్ద ఎత్తున భూ సమీకరణ చేస్తే, ఒకవేళ రాజధాని 2019 ఎన్నికల నాటికి పూర్తి కాకపోతే, 2019 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి గెలవకపోతే, భూములిచ్చిన రైతులక పరిస్థితి ఏమిటంటే 2015 లోనే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, అమరావతి రైతులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూడు వేల ఎకరాలు రాజధానికి ఎలా సరిపోతాయి అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేసింది.
అయితే అప్పటికే భూములు ఇచ్చిన రైతులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ అభివృద్ధి నిరోధకుడు అని అంటూ, పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకోకపోతే దిష్టిబొమ్మలు తగలబెడతాం అని వారు హెచ్చరించారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి:
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధికారికంగా స్పందించింది. రైతుల పక్షాన తాము నిలబడతామని, వారి డిమాండ్ల కోసం పోరాడుతామని, త్వరలోనే పార్టీ తరఫున కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడం మీద ముఖ్యమంత్రి దృష్టిసారించాలని , రాజధానుల మార్పు మీద కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే దీనిపై డిబేట్ పెట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యను చీల్చి చెండాడింది. రైతుల డిమాండ్లను పరిష్కరిస్తాం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, వారికి ఉన్న ఏకైక డిమాండ్ అమరావతిని రాజధానిగా కొనసాగించడమేనని ఈ ఛానల్ యాంకర్ అభిప్రాయపడ్డారు. కార్యాచరణ త్వరలో నిర్ణయిస్తారు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కూడా తప్పుపట్టిన ఆంధ్రజ్యోతి ఛానల్, కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడం పై ముఖ్యమంత్రి దృష్టిసారించాలని వ్యాఖ్యలను కూడా జీర్ణించుకోలేక పోయింది. రాజధాని మార్పు సమస్య నుండి పవన్ కళ్యాణ్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడింది.
ఆంధ్రజ్యోతి కథనం పై నెటిజన్స్ ఫైర్:
ఏ సమస్యా లేనప్పుడు అసలు జనసేన పార్టీ లేదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైందని అంటూ ఒక రేంజ్ లో కథనాలు వేసే ఆంధ్రజ్యోతి, సమస్య వచ్చినప్పుడు మాత్రం అటు చంద్రబాబు ని, జగన్ ని ప్రశ్నించకుండా- పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నించాలి అంటూ కథనాలు చేయడం ఏంటని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పైగా ఇటీవల నూతన విద్యా పాలసీ విషయంలో పవన్‌కళ్యాణ్ సూచనలను పరిగణలోకి తీసుకున్నామని కేంద్ర మంత్రి ప్రకటిస్తే ఆ వార్తను ప్రసారం చేయకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించే చానల్స్ ప్రభుత్వం తన అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి అంటూ డిబేట్ లు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆయా చానల్స్ పెద్దలు ఆలోచించుకోవాలి అంటూ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి చేసిన కథనం బ్యాక్ ఫైర్ అయినట్లు గా కనిపిస్తోంది
– జురాన్ (@CriticZuran)