కాపుల రిజర్వేషన్ల అంశంపై మరోసారి మీడియా ముందుకు వచ్చారు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఇన్నాళ్లూ ఛలో అమరావతి పాదయాత్ర చేస్తానంటూ ఆయన హడావుడి చేయడం, కిర్లంపూడిలో ఆయన్ని పోలీసులు గృహ నిర్బంధం చేయడం, అయినా తాను తగ్గేది లేదని పట్టుదలకు పోవడం.. ఇవన్నీ చూశాం. గడచిన వారంలో కూడా ముద్రగడ కార్యాచరణకు దిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్నాళ్లపాటు తన కార్యక్రమాలు వాయిదా వేసుకుందాం అనుకున్నారో ఏమో… చంద్రబాబు సర్కారుకు కొత్త అల్టిమేటం జారీ చేశారు! ప్రభుత్వానికి కొత్త గడువు పెట్టారు. వచ్చే డిసెంబర్ నాటికి కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం అంటున్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తున్నట్టు చెప్పారు.
కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ మోసమే చేస్తున్నారంటూ ముద్రగడ విమర్శించారు. గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు, ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో కూడా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని ముద్రగడ గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఆరు నెలలోపు కాపుల రిజర్వేషన్ల సంగతి తేల్చేస్తానని చెప్పిన చంద్రబాబు… ఇప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదని ముద్రగడ మండిపడ్డారు. సీఎం తీరు వల్లనే ఉద్యమించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం తీరు వల్లనే కాపులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ ఆందోళనలు మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి డిసెంబర్ వరకూ సమయం ఇస్తున్నట్టు అల్టిమేటం జారీ చేశారు!
కాపుల రిజర్వేషన్ల విషయమై తాత్సారం ఎందుకు జరుగుతోందీ అంటే, ప్రభుత్వం దగ్గర ఒక స్టాండర్డ్ సమాధానం ఉంది! మంజునాథ కమిషన్ నివేదిక రావాలి, వచ్చిన వెంటనే రిజర్వేషన్లు ఇచ్చేస్తామని అంటారు. అంతేకాదు, కాపులకు రిజర్వేషన్లు కావాలనే అవసరాన్ని తానే గుర్తించానని కూడా చంద్రబాబు చెప్పుకుంటారు. ఇంతకీ, ఆ కమిషన్ నివేదిక ఎప్పటికి వస్తుందో తెలీదు. ముద్రగడ ఏరకమైన కార్యాచరణకు దిగినా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది వాస్తవం. ఆ విషయం ఆయనకీ తెలుసు. కానీ, ఇప్పుడు డిసెంబర్ వరకూ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఈలోగా ప్రభుత్వం అద్భుతాలు చేసేస్తుందని ఆశించడమూ అత్యాశే కదా! కాబట్టి, డిసెంబర్ తరువాత ఉద్యమాన్ని మరింత ప్రభావవంతంగా ఎలా నడపాలనేదానిపైనే ముద్రగడ దృష్టి పెడతారేమో చూడాలి.