వైఎస్ఆర్సిపి ఇప్పుడు పార్టీ నిర్మాణ పరంగానూ రాజకీయ వ్యూహాల పరంగానూ ద్విముఖ వ్యూహం చేపట్టినట్టు కనిపిస్తుంది. జిల్లాల వారి ప్లీనంలు పెద్ద ఎత్తునే జరుగుతున్నాయట. మహౌత్సాహంగా వైసీపీ అని వారు నిరంతరం విమర్శించే పత్రికే పెద్ద కథనం ఇవ్వడం ఇందుకో నిదర్శనం.జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని నెల్లూరు ప్లీనంలో నేతలు ప్రకటించారు. ఉత్తరాంధ్రంలోనూ వూపు చూపిస్తున్నారు. వచ్చే నెలలో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనంతో వైసీపీ రాజకీయంగా కీలకమైన కార్యాచరణ ప్రారంభించవచ్చు. అంటే దూకుడు పెంచడం, అభ్యర్థుల ఎంపికలు.వనరుల సమీకరణ వంటివన్న మాట. సామాజికంగా తమను బలపర్చే దళిత వర్గాలు దూరం కాలేదనీ, కొత్త వారు కూడా వచ్చే అవకాశముందని వారంటున్నారు. కేంద్రంలో బిజెపితో వరస కుదరడం కూడా నూతనావకాశంగా భావిస్తున్నారు. కేసులలో జగన్ కు వ్యతిరేకంగా ఏదో పెద్ద తీర్పు వచ్చేస్తుందనే భావన వైసీపీలో లేదు.జగన్కు ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా రహేజా కేసు కొట్టివేయడం ఒకింత ఉపశమనం అనుకుంటున్నారు. తెలుగుదేశంపై అసంతృప్తి పెరిగిపోతున్నదని వారికి ఏకైక ప్రత్యామ్నాయంగా వున్న తమ దగ్గరకు రావలసిందేనని వైసీపీ నేతలు లెక్కేసుకుంటున్నారు. కాని పవన్ కళ్యాణ్ ప్రవేశం, వామపక్షాల వ్యూహం, కాంగ్రెస్ కదలికలు వంటి వాటి ప్రభావం వుండదని వారు నమ్ముతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక బహుశా ఈ విషయంలో ఒక సంకేతం కావచ్చు. తర్వాత కొన్ని మునిసిపాలిటీల ఎన్నికలు కూడా వాయిదా పడి వున్నాయి. అయితే వాటిని నిర్వహిస్తారా లేదా అన్నది సందేహమే.