తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కేసీఆర్ వదలుకుకున్నారు. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు . అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా పోయింది. ఇప్పుడు ఇతరులు టీఆర్ఎస్ పేరుతో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ?. ఆ పేరుతో పార్టీ లేదు కాబట్టి ఎవరైనా రిజిస్టర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో సందేహం లేదు. రెండు రోజుల కిందటే ఆ పేరును వదిలేశారు కాబట్టి కొంత కాలం తర్వాత ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రాకంర వారికి ఆ పేరు కేటాయిస్తారు. లేదంటే కొత్తగా పార్టీ పెట్టుకునేవారు ఆ పేరుతో ప్రారంభించుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజకు ఓ బ్రాండ్ లాంటిది. అది వారి ఇంటి పార్టీ అనడంలో సందేహం లేదు. అలాంటి పార్టీని కేసీఆర్ జాతీయ లక్ష్యాలతో వదులుకున్నారు. ఇతర చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని.. కేసీఆర్ లేని టీఆర్ఎస్ కు కనీస ఉనికి ఉండదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేరు ఒక్కటే మారింది..కానీ కలర్,… ఎన్నికల గుర్తు మారదు. అందుకే టీఆర్ఎస్ పేరుతో ఇతర పార్టీలు వచ్చినా సమస్య ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయాలంటే వ్యూహ ప్రతి వ్యూహాలు. ఎవరు ఎప్పుడుఎలాంటి ఎత్తుగడ వేస్తారనేది అంచనా వేయడం కష్టం. టీఆర్ఎస్ లేని తెలంగాణను ఊహించడం అసాధ్యం. కానీ కేసీఆరే స్వయంగా టీఆర్ఎస్ను వదిలేశారు. బీఆర్ఎస్గా మార్చారు. అందుకే ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లో … టీఆర్ఎస్ పేరుతో జరిగే రాజకీయాలకు కొదవ ఉండదనేది అంచనా.