రాఘవేంద్రరావు దయ వల్ల దర్శకత్వ పర్యవేక్షణ అనే కొత్త పోస్టు ఒకటి వచ్చింది. నిర్మాణ పర్యవేకణ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్) అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడు కొత్తగా రచనా పర్యవేక్షణ అనే పదం కనిపెట్టారు. బుర్రా సాయిమాధవ్ కోసం. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘కౌశల్య కృష్ణమూర్తి’ అనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బుర్రా సాయిమాధవ్ రచనా పర్యవేక్షణ చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి కథ, మాటలు పూర్తయిన తరవాత… బౌండెడ్ స్క్రిప్టు బుర్రా చేతికి వెళ్లింది. అందులో కొన్ని కీలకమైన సీన్లు బుర్రా మళ్లీ కొత్తగా రాశారట. అందుకే రచనా పర్యవేక్షకుడిగా తన పేరు వేసుకుంటున్నారు. ఆయన రాసింది కేవలం కొన్ని సన్నివేశాలే అయినా… భారీ మొత్తంలో పారితోషికం కూడా అందుకున్నారట. కె.ఎస్.రామారావు గతంలో తీసిన ‘మళ్లీ మళ్లీ ఇది రానీరోజు’ చిత్రానికి సంభాషణలు అందించారు బుర్రా. ఆ సినిమా బుర్రాకి మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే తాను సైరా, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో బిజీగా ఉన్నా సరే… ‘కౌశల్య కృష్ణమూర్తి’కి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.