తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళ్లే వారి కోసం టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో సెప్టెంబర్ చివరి వరకు వన్య మృగాల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చిరుతల సంచారం కొంతకాలంగా పెరిగిన నేపథ్యంలో… భక్తులకు ఇబ్బంది కలగకుండా, టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
సెప్టెంబర్ నెలాఖరు వరకు వన్య మృగాల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు టీటీడీకి సమాచారం ఇచ్చారు. కాలినడకన వెళ్లే భక్తులతో పాటు తిరుమల ఘాట్ రోడ్డులోనూ చర్యలు చేపట్టాలని కోరారు.
దీంతో టీటీడీ తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9గంటల వరకు మాత్రమే టూవీలర్స్ కు అనుమతి ఉంటుంది. భక్తులు ఇందుకు అనుగుణంగా ప్రయాణించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. భక్తుల ప్రాణాపాయాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలని టీటీడీ కోరుతోంది.
ఇక, కాలినడక వెళ్లే భక్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు తగిన భద్రత పెంచుతున్నారు. కాలినడన భక్తులకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగనున్నాయి.