విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసులో… ఎన్ఐఏ.. ప్రత్యక్ష సాక్షులను విచారించడం ప్రారంభించింది. ప్రత్యక్ష సాక్షులైన వైసీపీ నేతలను విశాఖలో ప్రశ్నిస్తోంది. మళ్ల విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జియ్యాని శ్రీధర్.. మజ్జి శ్రీనివాసరావు, పీడిక రాజన్నదొర, తైనాల విజయ్, కరణం ధర్మశ్రీ, కె.కె.రాజు, కొండ రాజీవ్‌గాంధీ, తిప్పల నాగిరెడ్డి , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను ప్రశ్నిస్తోంది.వీరందరికీ.. గతంలో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. ఇందులో మజ్జి శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ మేనల్లుడు. దాడి జరిగిన తర్వాత కోడి కత్తిని తనతో పాటు తీసుకెళ్లిపోయారు. గంటన్నర తర్వాత కత్తిని పూర్తిగా శుభ్రం చేసి తీసుకు వచ్చి పోలీసులకు అప్పగించారు. అలా ఎందుకు చేశారన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఎన్ఐఏ అధికారులు దీనిపై మజ్జి శ్రీనివాసరావును ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ కేసులో బాధితుడైన జగన్ వాంగ్మూలాన్ని ఇంత వరకూ ఎన్ ఐఏ నమోదు చేయలేదు. కానీ.. విచారణకు రావాలని.. స్టేట్ మెంట్ ఇవ్వాలన్న నోటీసు కూడా జారీ చేయలేదు. మరో వైపు జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏ విచారణ నుంచి తప్పించాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేసింది. హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.రాజ్యాంగ విరుద్ధంగా.. ఈ కేసును ఎన్ఐఏ పరిధిలోకి తీసుకున్నారనేది ఏపీ ప్రభుత్వ వాదన. ఇప్పటికే.. ఈ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోంది.
అన్నీ కోర్టు అనుమతితోనే.. ఎన్ఐఏ విచారణ చేస్తోంది. శ్రీనివాసరావును కోర్టు అనుమతితోనే కస్టడీలోకి తీసుకుంది. అలాగే.. కేసు రికార్డులు కూడా.. కోర్టు ఆదేశాలతోనే వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం.. హైకోర్టుకు వెళ్లింది. సాంకేతికంగా చూస్తే.. ఈ కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తుందా లేదా అన్నదానిపై సందేహాలున్నాయి.