స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న రమేష్ కుమార్‌ను తొలగించేలా.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది చెల్లదని స్పష్టం చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమారే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది. ఎస్ఈసీగా ఉన్న రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమంటూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును ఇవాళ ప్రకటించారు.
ఎస్ఈసీ పదవి కాలాన్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ ఆర్డినెన్స్ ఆధారంగా ఎస్ఈసీగా ఉన్న రమేష్‌కుమార్ ను తొలగించి.. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి కనగరాజ్‌ను ఎస్ఈసీగా నియమించారు. అయితే.. ఆర్డినెన్స్ తనకు వర్తించదని.. కొత్తగా నియమించబోయే వారికే వర్తిస్తుందని.. తనను పూర్తి పదవీ కాలంలో ఉండేలా ఆదేశించాలని కోరుతూ రమేష్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. రమేష్‌కుమార్‌తో పాటు ఇతర విపక్షాల నేతలు కూడా.. పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ సమయంలో.. తాము నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించలేదని.. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఆర్డినెన్స్ తీసుకు రావడంలో భాగంగా ఆయన పదవి కోల్పోయారని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
కరోనా కారణంగా స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో ఎస్ఈసీగా నిర్ణయాలు తీసుకున్న రమేష్ కుమార్ పై.. నేరుగా ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎస్ఈసీని తొలగించేలా ఆర్డినెస్ తీసుకు వచ్చారు. ఇప్పుడా ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయపరీక్షకు నిలవడం లేదు. పెద్ద ఎత్తున జీవోలు.. ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తోంది. ఈ క్రమంలో…ఎస్ఈసీ విషయంలో హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. అయితే.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.