ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ తన పదవిని న్యాయపోరాటం ద్వారా సాధించుకోవడానికి రూ. వంద కోట్లు ఖర్చు పెట్టారని ఓ వైసీపీ సానుభూతి పరుని సోషల్ మీడియా పేజ్ ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా.. ఓ ఇంటర్యూలో పేర్ని నాని సంచలన విషయాలు బయట పెట్టారంటూ పులిహోర కథ రాసేసింది. ఆ వార్తను వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసుకున్నారు. అటూ ఇటూ తిరిగి అది.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టికి వెళ్లింది. అయితే.. గతంలోలా ఆయన ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోవడంలేదు. నేరుగా వెబ్‌సైట్‌పై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.వంద కోట్లు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ అయ్యారని.. కథనంలో పేర్కొనడంపై ఎస్ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇలాంటి కథనాల వల్ల ఎన్నికల కమిషన్ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఫ.. వెబ్‌సైట్‌తో పాటు..కథనం రాసిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వంద కోట్లు వ్యయం చేసిన విషయాన్ని.. మంత్రి పేర్ని నాని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు వెబ్సైట్ కథనంలో పేర్కొంది. ఇప్పుడు పోలీసులు ఆ వార్తలో నిజాన్ని వెలికి తీయాల్సి ఉంటుంది. అంటే.. పేర్ని నాని అలా చెప్పారా లేదో తేల్చాలి. అంటే.. పేర్ని నాని ఇరుక్కుపోతారు. ఒక వేళ అలా చెప్పి ఉంటే ఆయన .. నిమ్మగడ్డ రూ. వంద కోట్లు ఖర్చు పెట్టినట్లుగా ఆధారాలు చూపించాల్సి ఉంటుది. లేకపోతే.. ఆయన రాజ్యాంగ వ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేసినందుకు చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ప్రస్తుతం ఏపీలో .. కోర్టుల్ని న్యాయమూర్తుల్ని దూషించినా.. అధికార పార్టీ నేతలకు ఎలాంటి భయం ఉండటం లేదు కాబట్టి… ఇప్పుడు ఎస్ఈసీ ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తారన్న నమ్మకం కూడా లేదు.
కానీ ఇవాళ కాకపోతే.. రేపైనా దీనిపై రియాక్షన్ ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అధికార బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా తమకు అనుకూలంగా లేని రాజకీయ పార్టీల నేతలు, అధికారులపై నిందలు వేయడంలో వైసీపీ సానుభూతి సోషల్ మీడియా పీహెచ్డీ చేసింది. ఇతరులు నిజాలు చెప్పినా కేసులు పెడతారు కానీ.. వైసీపీ సోషల్ మీడియా మాత్రం అందరిపై తిట్లు, బూతుల విరుచుకుపడుతుంది. ఇప్పుడు ఆ మీడియాపై నిమ్మగడ్డ పోరాటం ప్రారంభించారు.