ప్రభుత్వం ఎంత పట్టుదలకు పోతోందో… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా.. అంతే పట్టుదలగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆయన తాను బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత విజయవాడ ఎస్ఈసీ కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. అయితే.. హైకోర్టు తీర్పు వల్ల ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం లేదనే వాదనను అడ్వకేట్ జనరల్ న్యాయసలహా ద్వారా ప్రభుత్వానికి అందించడంతో.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. రాత్రికి రాత్రి ఎన్నికల కమిషన్ కార్యదర్శిని కూడా మార్చేసింది. ఈ పరిణామాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్.. న్యాయపోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం హైకోర్టు కు వేసవి సెలవులు. వెకేషన్ బెంచ్ మాత్రం ఉంటుంది. ఆ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయాలా లేక… హైకోర్టుకు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత పిటిషన్ వేయాలా అన్న అంశంపై ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రకటించింది. హైకోర్టు ప్రకటించిన తీర్పు వల్ల అసలు నిమ్మగడ్డ నియామకే చెల్లదనే వాదనను.. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరాం వాదిస్తున్నారు. దీంతో.. ఈ కేసు వ్యవహారం కీలక మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎస్ఈసీగా మరోసారి రమేష్ కుమార్ రాకూడదన్న పట్టదలతో ప్రభుత్వం ఉంది. అయితే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకూ ఉంది. ఆ తర్వాత ఆయన ఆటోమేటిక్‌గా రిటైరవుతారు. ఈ కొద్ది కాలం కూడా.. ఆయనను పదవిలో ఉంచకూడదన్న లక్ష్యంతో ఉంది. నిమ్మగడ్డ కూడా అంతే పట్టుదలగా తన పదవీ కాలాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యమని ఆయన చెబుతున్నారు.