రేషన్ బియ్యానికి డబ్బులెవరిస్తారు ? మోడీ ఇస్తారా ..పోనీ కేసీఆర్ ఇస్తారా ? ఇంకెవరైనా ఇస్తారా ?. ఇది చెప్పడానికి ఏ మాత్రం ఆలోచన అవసరం లేదు. మోడీ కానీ కేసీఆర్ కానీ వ్యక్తిగతంగా ఒక్క రూపాయి ఇవ్వరు. ప్రజలు కట్టిన పన్నుల్లోంచే తీసిస్తారు. కానీ డబ్బులు మేమిస్తున్నాం కాబట్టి మా ఫోటోలు ఉండాలంటూ అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ వాదులాట ప్రారంభించాయి. అసలు ప్రజాధనాన్ని వాడుతున్నామన్న సంగతిని మర్చిపోయాయి.
ప్రజల సొమ్మంటే గౌరవం లేనట్లుగా నిర్మలా సీతారామన్ తీరు !
దేశం మొత్తానికి ఆర్థిక మంత్రి ఆమె. ఓ గల్లీలో రేషన్ షాపు దగ్గరకు వచ్చి అక్కడ ప్రధాని మోదీ ఫోటో పెట్టలేదని కలెక్టర్ని నిలదీశారు. బియ్యం ఇస్తోంది మోడీ కాదా అని నిలదీశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయింది. టీఆర్ఎస్ నేతలు తెర ముందుకు వచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఫోటో పెట్టాలన్నారు. తెలంగాణనే దేశాన్ని పోషిస్తోందన్నారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు పీఎంగా ఉన్న మన్మోహన్ ఫోటో పెట్టారా అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ఫోటోలు పెట్టాలి అని వాదులాడుకుంటున్నారు. డబ్బులు మేమిస్తున్నామంటే మేమిస్తున్నామంటున్నారు. నిజానికి వారెవరూ డబ్బులు ఇవ్వడం లేదు. అది ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్ము. అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్లుగా ప్రజల సొమ్మును పంచేస్తూ.. అది తామే ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడమే కాదు.. ప్రచారం చేయడం లేదని అడ్డగోలుగా విమర్శలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.
దేశాన్ని పోషిస్తోంది కేసీఆర్ కాదు.. తెలంగాణ ప్రజలు !
దేశం మాకేమి ఇవ్వడం లేదని.. తామే దేశానికి ఇస్తున్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే తమ నేత కేసీఆర్ ఫోటోలను ఇతర రాష్ట్రాల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నేతలు కూడా.. అసలు లాజిక్ మర్చిపోతున్నారు. దేశాన్ని పోషిస్తోంది కేసీఆర్ కాదు.. తెలంగాణ ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నులతోనే టీఆర్ఎస్ చెప్పినట్లుగా ఇతర ప్రాంతాలకు నిధులు వెళ్తున్నాయి. మరి కేసీఆర్ ఫోటో ఎందుకు ? సీఎం అయినంత మాత్రాన ప్రజలు పన్నులుగా కొట్టే సొమ్మును ఇష్టారాజ్యంగా వాడే నైతిక అధికారం ఉంటుందా ? కానీ ఈ విషయాలను తెలంగాణ నేతలు గుర్తించడం లేదు.
ప్రజల సొమ్ముతో రాజకీయ దానాలు…. సొంత సొమ్ములా ఖర్చులు !
కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజల పన్నుల సొమ్మును దారుణంగా వాడేస్తున్నాయి. పీఎం, సీఎంల ఇమేజి బిల్డర్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చే సంక్షే్మ పథకాలు తమ జేబుల్లో నుంచి తీసి ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. సొంత పేర్లను పథకాలకు పెట్టుకుంటున్నారు. పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్లి జగన్ ఇచ్చారు అని చెబుతున్నారు వైసీపీ నేతలు. జగన్ ఏమైనా సొంత సొమ్ము ఇచ్చారా ? మధ్యతరగతి ప్రజల నుంచి పన్నుల రూపంలో పిండేడబ్బుల్ని ఇలా జగన్ పేరుతో పంచుతున్నారు. దానికి మళ్లీ కోట్లలోప్రకటనలు అన్ని చోట్లా ఇంతే ఉంది.
రాజకీయ నేతలు… ప్రజాధనానికి అనుభవదారులు కాదు.. కస్టోడియన్లు మాత్రమే. కానీ బరి తెగించిన పాలకులముందు ఆ నైతిక విలువ కొట్టుకుపోయింది. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా .. సొంత ఓటు బ్యాంక్ కోసం.. ఇమేజ్ బిల్డర్ కోసం వాడుకుంటున్నారు.