హీరోలు అన్నాక, సినిమాలు అన్నాక ఫ్లాపులు వుంటాయి. హిట్ లు వుంటాయి. చాన్స్ లు, నిర్మాతలు లేకపోతే వేరసంగతి. అలా కాకుండా అవకాశం వుంటే మళ్లీ మళ్లీ మంచిగా ప్రయత్నించాలి. అంతేకానీ ఇంట్లో కూర్చునిపోవడం కాదు. హీరో నితిన్ వ్యవహారం ఇలాగే వుంది.
అ..ఆ సినిమా తరువాత వరుసగా మూడు ఫ్లాపులు, లై, శ్రీనివాసకళ్యాణం, ఛల్ మోహన్ రంగ. దీంతో ఇప్పుడు ఏ సినిమా చేయాలో అన్నది డిసైడ్ చేసుకోకుండా అలా సైలంట్ గా వుండిపోయినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టు తరువాత ఇంతవరకు సినిమా టచ్ చేయలేదు.
వెంకీ కుడుముల తో భీష్మ సినిమా అనుకున్నారు. వెంకీ ఆ స్క్రిప్ట్ అలా చెక్కుతూనే వున్నారు. సెకండాఫ్ కు రిపేర్లు చేస్తూనే వున్నారు. ఆ సినిమా పరిస్థితి అలా వుంది.
వైవిధ్యమైన సినిమాలే అయినా సరైన కమర్షియల్ హిట్ సినిమా ఇవ్వని యేలేటి చంద్రశేఖర్ తో సినిమా అని ప్రకటించాడు. అది ఎప్పుడు సెట్ మీదకు వెళ్తుందో తెలియదు.
సుకుమార్ అసిస్టెంట్ సూర్య ప్రతాప్ తో సినిమా అనుకున్నారు. అది కూడా గీతా బ్యానర్ లో. ఆ సినిమా కూడా ఆగిపోయింది.
ఆఖరికి పాపం, రమేష్ వర్మ లాంటి డైరక్టర్ తో కూడా నితిన్ పేరు జత కట్టేసి వార్తలు వచ్చేసాయి. అబ్బే అదీ చేయడం లేదు అని నితిన్ నే చెప్పేసాడు. దాదాపు తొమ్మిది నెలల బట్టి ఖాళీగా వుండి నితిన్ ఏం చేస్తున్నట్లు? ఇంకెప్పుడు సెట్ మీద కనిపిస్తాడో?