బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏదో చెప్పకూడనిది అసెంబ్లీలో చెప్పారంటూ దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది. చివరికి విదేశాల్లోని మహిళలతో కూడా పీఆర్ స్టంట్లు చేయించి.. నితీష్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయిస్తున్నారు. అమెరికాలో వారు చెప్పే “బూతులు” చేతల్లో వ్యవస్థీకృతం అయి ఉంటాయన్న సంగతి ఎవరికీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో నితీష్ కుమార్ జనాభా నియంత్రణపై మాట్లాడారు. అందు కోసం ఆయన ఎంచుకున్న భాష కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఆయన అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడాలనుకున్నారు. మాట్లాడారు. కానీ ఆయనపై దేశం మొత్తం దండెత్తింది. క్షమాపణలు చెప్పే వరకూ వదల్లేదు.
ఓ మై గాడ్ 3 సినిమా తీయక తప్పదేమో ?
ఇటీవల ఓ మై గాడ్ 2 అనే సినిమా వచ్చింది. ఇదేమీ భక్తిరస సినిమా కాదు. దేవుడు ఉన్నాడో లేడో చర్చించే సినిమా కాదు. పూర్తిగా సెక్స్ ఎడ్యూకేషన్ కు సంబంధించిన సినిమా. దేశ యువతలో … అసలైన అంశాలపై అవగాహన పెంచకుండా వారిలో అపోహలు పెంచుతూ పోవడం వల్ల ఏర్పడే సమస్యలపై చర్చించిన సినిమా. ఇది సూపర్ హిట్ అయింది. అందరూ … యువతకు చూపించాల్సిన సినిమాగా చెప్పుకున్నారు. కానీ అది కూడా బహిరంగంగా చెప్పలేకపోయారు. అదే మన దేశం చేసుకున్న సమస్య. అవసరమైన విజ్ఞానాన్ని అశ్లీలం పేరుతో గుప్పిట పట్టేసుకుని అసలైన దారి తప్పించే అశ్లీలాన్ని మాత్రం స్మార్ట్ ఫోన్ నిండా నింపేసుకుని ఉంటాం. ఇప్పుడు నితీష్ కుమార్ చేసిన ప్రసంగంపై రేగుతున్న దుమారం చూస్తే… ఆ అంశంపైనా మరో సినిమా తీయక తప్పదేమో.?
నితీష్ భాష తప్పు కావొచ్చు కానీ భావం మంచిదేగా !
బీహార్ అనాదిగా వెనుకబడిపోయింది. దానికి నితీష్ కూడా కారణం కావొచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా బీహార్ ను పాలించారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండవచ్చు కానీ.. బీహార్ ప్రజలకు.. యువతకు.. చేసిందేమీ లేదు. వారేమీ బాగుపడలేదు. ఈ విషయంలో ఆయనను నిందించాల్సిందే. కానీ అక్కడి ప్రజలు మెరుగుపడుతున్నారని.. చదువుకుంటున్నారని.. తెలివి తెచ్చుకుంటున్నారని.. జనా భా నియంత్రణ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఆయన చెప్పిన భాష .. వెల్లడి చేసిన విధానం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కానీ దాన్ని ఆయన ఏదో భరించలేనంత తప్పు చేశారన్నంతగా నిందించడం కరెక్టనా ?
ప్రతీ దానికి మహిళల పేరుతో రాజకీయం !
నితీష్ చెప్పిన మాటలు అనేక మంది సెక్స్ ఎడ్యుకేషన్ నిపుణులు వివిధ సందర్భాల్లో బహిరంగంగా చెప్పినవే. చెబుతున్నవే. మ్యాగజైన్లు , యూట్యూబ్ వీడియోలు ఎన్నింటిలోనో ఆ సలహాలు ఉన్నాయి. ఆయన అలా చెప్పడం మహిళల్ని కించపర్చేశారంటూ బయలుదేరుతున్నారు. దేశ విదేశాల నుంచి స్పందనలు తీసుకుని దాడి చేస్తున్నారు. చివరికి నితీష్ క్షమాపణలు చెప్పారు. ఇలా చేయడం వల్ల.. మరోసారి ఎవరూ మాట్లాడలేకపోవచ్చు. కానీ అలా కొన్ని విషయాలను ..బహిరంగంగా చెప్పకపోవడం వల్ల అసలైన విజ్ఞానం అందదు. అదో తప్పుగా ముద్రపడిపోతుంది. అదే తప్పు అయితే నాగరిక సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది.