లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కేటీఆర్ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఆ వివరాలు చెప్పాలని ఎవరైనా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేస్తే మాత్రం.. అలాంటి వివరాలేమీ లేవని చెబుతున్నారు. దీంతో కేటీఆర్ చెప్పే పెట్టుబడులు, ఉద్యోగాల కథలన్నీ ఉత్తుత్తివేనన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేటీఆర్ పలు చోట్ల… 2014 నుంచి ఇప్పటి వరకూ మూడు లక్షల 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులు.. 22 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చెబుతున్నారు. ఇందులో నిజమేంటో తెలుసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టంద్వారా పెట్టుబడిదారులు, కంపెనీల వివరాలు కావాలని దరఖాస్తు చేశారు.
అయితే వీరి దరఖాస్తుకు అంతిమంగా వచ్చి సమాచారం.. తమ దగ్గర సమాచారం లేదనే. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నో డాటా ఎవైలబుల్ అని ఎద్దేవా చేసే కేటీఆర్ ఇలా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం లేదని సమాధానం పంపేలా చేయడం ఏమిటన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. ట్రేడ్ ప్రమోషన కార్పొరేషన్ .. పరిశ్రమల కమిషనర్ ఇలా అందరూ తమ వద్ద సమాచారం లేదంటూ జవాబిస్తున్నాయని, అయితే… రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులు, 22.5 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నిస్తోంది.
కేటీఆర్ చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల వివరాలు కంపెనీల వారీగా ఈ వివరాలను సమగ్రంగా బయటపెట్టకపోతే… అదంతా మిథ్య అని, ఉత్తుత్తి ఉద్యోగాలేనని ప్రజలు నమ్ముతారని హెచ్చరిస్తోంది. కేటీఆర్ ఇకముందు మంత్రి చెప్పే అంకెలు, సమాచారాన్ని ప్రజలు అనుమానంతో చూస్తారని పేర్కొంది. తెలంగాణలో పారిశ్రమిక అభివృద్ధి ఘనం అని.. ప్రపంచ పెట్టుబడిదారులంతా తెలంగాణ వైపు చూస్తున్నారని కేటీఆర్ చెబుతూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అలాగే ప్రకటనలు చేస్తూ ఉంటుంది. కానీ రికార్డుల్లో లేకపోతే అది ఉత్త ప్రచారమనే అనుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం దగ్గర వివరాలు లేకపోవడం చూస్తే అది నిజంగానే ఫేక్ ప్రచారం అనుకుంటారు. మరి కేటీఆర్ అన్నీ బయటపెడతారో లేదో !