నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రోజు రోజుకూ రసవత్తరంగా మారుతోంది. 185 మంది అభ్యర్థులు తలపడుతున్న ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమకు గిట్టుబాట ధర లభించడం లేదంటూ.. పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బరిలోకి దిగడంతో ఫలితాలపై ఆ ప్రభావమెంత అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవ్వడంతో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అయితే ఈసీ మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ వాయిదా వేయాలని ఎన్నికల బరిలో నిలిచిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు తమకు గుర్తులు కేటాయించకపోవడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 వోటింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో మిషన్ లో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. ఇలా 185 మంది కోసం 12 మిషన్లు సమకూరుస్తారు. వరుసగా పేర్చిన ఈవీఎంలలోంచి తమ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తే.. పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ.. మొదట్లో బ్యాలెట్కే మొగ్గు చూపిన ఈసీ ఆ తర్వాత ఈవీఎంలతోనే అని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు మిషన్లను తీసుకొచ్చి పరిశీలించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కష్టతరమైన వ్యవహారమని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ పోలింగ్ ప్రక్రియ ఈవీఎంల ద్వారానే సాగాలని నిర్దేశించింది.
నిజామాబాద్లో భారీ ఎత్తున నామినేషన్లు వేసిన రైతులు .. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక ఉంటుందని భావించారు. ఇలాగైతే కొంతలో కొంత తమ లక్ష్యం నెరవేరుతుందని ఆశించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించాలని భావించడం రైతులను ఆలోచనలో పడేసింది. సాధారణ ఓటరు 12 ఈవీఎంలను పరిశీలించే సమయం ఉండదు. అందులో తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా అంత సులువైన విషయం కాదు. దీంతో ఓటరు అయోమయానికి గురైతే అనుకున్న ఫలితం రాదని రైతు ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే ఎన్నికను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. ఇంకా గుర్తు కేటాయించకపోతే తాము ప్రచారం ఎలా చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నారు.