వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన తర్వాత మళ్లీ వెనక్కి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రివర్స్ టెండరింగ్.. రివర్స్ నిర్ణయాలు..ఇలా రెండేల్ల పాటు ఎక్కువ రివర్స్ నిర్ణయాలు తీసుకున్న ఆయన ఇప్పుడు .. ఆ నిర్ణయాలను మళ్లీ రివర్స్ చేస్తున్నారు. ఇటీవల నిర్ణయాల ఉపసంహరణ సీజన్ నడుస్తోంది. అయితే అవన్నీ ప్రభుత్వ పరమైనవి. రాజకీయ పరమైన నిర్ణయాలపైనా ఆయన వెనక్కి తగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రుల్ని మార్చేస్తానని జగన్ ప్రకటించారు.
ఇటీవల ఆ శాతాన్ని వందకు పెంచినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఏడెనిమిది మంది వివాదాస్పద మంత్రులను తొలగించి ఇతరులకు చాన్సిచ్చి సరి పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత ఎడెనిమిది మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని ఆ వరకే భర్తీ చేయనున్నట్లుగా వైసీపీ ఉన్నత నేతలకు చూచాయగా సమాచారం అందింది. దీంతో ప్రత్యేర్థులపై బూతులతో విరుచుకుపడుతూ విశ్వాసాన్ని చాటుతున్న వారికి రిలీఫ్ లభించినట్లయింది. ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. సొంత పార్టీలో అసంతృప్తి ఇప్పుడు ఏ మాత్రం పెరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ కారణంగానే జగన్ మంత్రుల తొలగింపు నిర్ణయం వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీపై పట్టు పెంచుకుంటున్న కొంత మంది సీనియర్లకు మాత్రం చెక్ పెడతరాని.. ఒకరిద్దర్ని రాజ్యసభ పేరుతో ఢిల్లీకి పంపిస్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే కేబినెట్‌ను మార్చాలన్న జగన్ నిర్ణయంపై మాత్రం వెనక్కి తగ్గినట్లేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.