” జగనన్న స్కూళ్లలో తెస్తున్న మార్పులు చూస్తూంటే.. నాకు మళ్లీ బడికెళ్లి చదువుకోవాలనిపిస్తోంది ” అనే ఓ డైలాగ్ ను విస్తృతంగా వాడేస్తున్నారు వైసీపీ నేతలు. లక్ష్మిపార్వతి, రోజా తో పాటు చాలామంది అన్నారు. సోషల్ మీడియాలోనూ అలాంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ వాస్తవమేమిటంటే.. గవర్నమెంట్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. చేరే వారుకూడా జంప్ కొట్టి ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు.
2022 సెప్టెంబరు నాటికి ఏపీలోని ప్రభుత్వ బడుల్లో 41,38,322 మంది విద్యార్థులున్నారు. 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 39,95,922కి తగ్గింది. అంటే స్కూల్ నడుస్తూండగానే మానేశారన్నమాట. ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుతం 37,50,293 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే గతేడాది తొలుత బడుల్లో చేరిన వారితో పోలిస్తే దాదాపుగా నాలుగు లక్షల మంది తగ్గిపోయారు. వీరంతా ప్రభుత్వ బడుల్లో పాఠాలుచెప్పడం లేదని ప్రైవేటు స్కూళ్లలో చేరిపోయారు. దీనికి కారణం స్కూళ్ల విలీనం, టీచర్ల కొరత.
పాఠశాలల విలీనం జరిగిన 4,200 పాఠశాలల్లో రెండే తరగతులున్నాయి. వాటిలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తొమ్మిది వేలకు పెరిగింది. అంటే తొమ్మిది వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటలేదు. పెద్ద స్కూళ్లలో టీచర్ల కొరత ఎక్కువగా ఉంది. ఏ స్కూల్లోనూ అన్ని సబ్జెక్టులకు టీచర్లుఉన్నారని చెప్పలేని పరిస్థితి. గత నాలుగేళ్లుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. దీంతో స్కూళ్ల పరిస్థితి దారుణంగా మారింది. నాడు, నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టారు. రంగులేశారు. కానీ విద్యార్థులకు చదువు చెప్పే మౌలిక సదుపాయాలు మాత్రం పెరగలేదు.