ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాలేదు, రాజధాని నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది, పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సి ఉంది, యువతకి ఉపాధి లభించాల్సి ఉంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే మొదలైన ప్రాజెక్టుల పనులూ నిర్మాణాలు కొనసాగాల్సి ఉంది. ఇలాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా విడుదల చేసే మేనిఫెస్టో ఒక విజన్ డాక్యుమెంట్ లా ఉండాలి. కానీ, జగన్ విడుదల చేసినదాన్లో ఆ విజన్ కనిపించడం లేదు. ఏపీలో ముఖ్యాంశాలు అనుకున్నవాటిపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేకపోయారు అనిపిస్తోంది.
ప్రత్యేక హోదా సాధనతోనే ఏపీ అభివృద్ధి ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే. హోదా వస్తే యువతకు మరింత పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు వస్తాయి. అయితే, దీనిపై మేనిఫెస్టోలో జగన్ చెప్పింది ఏంటంటే… హోదాపై అలుపెరుగమని పోరాటం చేస్తున్నామనీ, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామన్నారు. అంటే, హోదా వస్తే తప్ప యువత ఉపాధికి వారేం చెయ్యలేరా? హోదాతో సంబంధం లేకుండా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేసే ప్రణాళికను జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారు. హోదా రాకపోతే యువత ఉపాధి పరిస్థితి ఏంటో చెప్పలేకపోయారు. పోనీ, హోదాను ఫలానా టైంలోగా సాధిస్తామని స్పష్టంగా చెప్పినా, ఉపాధీ పారిశ్రామికాభివ్రుద్ధిపై కొంత స్పష్టత ఉండేది.
కాపు రిజర్వేషన్ల గురించి జగన్ మాట్లాడుతూ… సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతం మించి ఉండకూడదని మనకు తెలిసిందే అన్నారు. ఇది తెలిసినా కాపులను బీసీల్లో కలుపుతామని టీడీపీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందనీ, మన పరిధిలో లేని విషయాన్ని మనం ప్రయత్నిస్తామని మాత్రమే చెప్పగలమనీ, అంతకుమించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే.. అది మభ్యపెట్టే చర్య అవుతుందన్నారు జగన్. బీసీ ప్రయోజనాలకు భంగం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమ మద్దతు ఉంటుందని జగన్ చెప్పారు. ఆ తరువాత, కాపు కార్పొరేషన్ నిధుల గురించి జగన్ మాట్లాడారు. కాపుల రిజర్వేషన్లపై కూడా మరోసారి స్పష్టత ఇవ్వలేకపోయారు జగన్. తమ ప్రయత్నం ఉంటుందన్నారుగానీ.. ఆ ప్రయత్నం ఎలా ఉంటుందీ, ఎలా చేస్తారు అనేది ఈ మేనిఫెస్టోలో జగన్ చెప్పలేకపోయారు. ఇది కూడా ఏపీలో కీలకాంశమే.
ఇంకోటి, ఏపీలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం. దీనిపై కూడా జగన్ మేనిఫెస్టోలో స్పష్టత లేదు. పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో చెరువులు, కాలువలు బాగుచేస్తామని… పైపైన చెప్పారు. రాష్ట్రంలో మంచి ఫలితాలను సాధించిన నదుల అనుసంధానం గురించి ప్రస్థావన లేదు.
వ్యవసాయం, పరిశ్రమలు, యువత ఉపాధి… వీటిపై స్పష్టమైన విధానం ఉంటే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయ మార్గాల పెంపుపై స్పష్టత ఇవ్వకుండా… పెద్ద ఎత్తున ప్రకటించేసిన సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయి..? వాటిని అమలు చేస్తారంటే నమ్మకం ఎలా కుదురుతుంది..? పోనీ, ఆంధ్రా మిగులు బడ్జెట్ లో ఉందంటే కొంత అర్థం ఉండేది. ఓవరాల్ గా, నవ్యాంధ్రలోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ మేనిఫెస్టో తయారు చేశారనే అభిప్రాయం చాలామందికి కలుగుతోంది.