తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో పదమూడు రోజులు మాత్రమే ప్రచార గడువు ఉంది. ఇంకా భారీగా హంగామా చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. పైపైన ప్రచారం చేసి.. ఓట్లు వేస్తే వేశారు లేకపోతే లేదన్నట్లుగా వదిలేస్తున్నారు. దీనికి కారణం భారీగా అయ్యే ఖర్చు.. మండే ఎండలుగా భావిస్తున్నారు.
ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. అభ్యర్థులు సాయంత్రం వరకూ ప్రచారం చేయలేకపోతున్నారు. తాము లేకపోయినా నియోజకవర్గం మొత్తం ప్రచారం జరిగేలా చేయడానికి క్యాడర్ ను యాక్టివేట్ చేద్దామంటే.. మాకేంటి అని అడుగుతున్నారు. ఒకటి కాదు.. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాడర్ కు పంపిణీ చేయాలి. అది అంత తేలిక కాదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా తిరిగి ఖర్చు పెట్టుకున్న నేతలు ఇప్పుడు ఎంతో కొంత వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ అభ్యర్థులు అంత బలమైన వారు కాకపోవడంతో చాలా చోట్ల ఇబ్బంది ఏర్పడింది.
అసెంబ్లీ ఎన్నికల ఖర్చులు.. వాటి లెక్కలను ఇంకా రాజకీయ పార్టీలు తేల్చుకోలేదు. క్యాడర్ కూడా ఇంకా అసెంబ్లీ ఎన్నికల బడలిక నుంచిబయటకు రాలేదు. అందుకే ప్రచారంలోనూ.. బహిరంగసభల్లోనూ ఎక్కడాజోష్ కనిపించడం లేదు ఇంతే నీరసంగా ఎన్నికలు జరుగుతాయని.. ఓటింగ్ కూడా తగ్గే చాన్స్ ఉందన్న ఆందోళన పార్టీల్లో వ్యక్తమవుతోంది.