చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాలకు రాయుడు లేకపోవడాన్ని కారణంగా చూపిన మహేంద్ర సింగ్ ధోనీకి… హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు చెప్పడానికి సాకు లేకుండా పోయింది. ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లో రాయుడు విజయాన్నిచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత గాయపడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చెన్నై ఓడిపోయింది. ఈ ఓటములకు కారణంగా రాయుడు జట్టులో లేకపోవడంతో బ్యాటింగ్ లైనప్ సమతూకం దెబ్బతిన్నదని అందుకే ఎవరూ కుదురుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రాయుడు అందుబాటులోకి వచ్చినా సాదాసీదా లక్ష్యాన్ని చేదించడానికి కూడా తంటాలు పడింది. చివరికి గెలవలేకపోయింది.
దుబాయ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల టార్గెట్‌ను చేధించడం పెద్ద విషయం కాదు. అదీ కూడా ధోనీ నాయకత్వం ఉన్న జట్టుకు అస్సలు కాదు. ఉఫ్ మని ఊదేస్తారని అనుకున్నారు. కానీ మ్యాచ్‌లో అలా జరగలేదు. మొదటి నుంచి చెన్నై ఇబ్బందులు పడుతూనే ఉంది. గాయం నుంచి కోలుకుని వచ్చి గేమ్ ఛేంజర్‌గా మారుతాడనుకున్న రాయుడు పూర్తిగా నిరాశపరిచాడు. పట్టుమని పది నిమిషాలు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. ఫలితంగా హైదరాబాద్ నిర్ణయించిన 165 పరుగుల స్కోరే చెన్నైకు కొండలా కనిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేసి ఐపీఎల్ ఆడుతున్న ధోనీ… పెద్దరికం అనుకుంటున్నాడేమో కానీ.. స్లోగా ఆడుతున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి.. ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
గెలుపు కోసం ఓ దశలో రవీంద్ర జడేజా బాగానే ప్రయత్నించారు. ధోనీ-జడేజా కాంబినేషన్ నెమ్మదిగా విజయం వైపు తీసుకెళ్లినట్లుగా అనిపించినా కీలక సమయంలో జడేజా అవుటవ్వడంతో ఆశలు నీరుగారిపోయాయి. ధోనీ ఉన్నప్పటికీ చివరి ఓవర్లలో పరుగులు రావడం గగనం అయిపోయింది. ఒత్తిడి పెరిగి మిగతా బ్యాట్స్మెన్లూ ఔటయ్యారు. చివరికి ఏడు పరుగుల తేడాతో ఓడిపోయారు. ధోనీ ఇంకాస్త వేగంగా ఆడి ఉంటే గెలిచి ఉండేదని చెన్నై ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటే అది వారి తప్పు కాదు.
ఐపీఎల్లో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న చెన్నై ఒక గెలుపు.. మూడు పరాజయాలతో ప్రస్తుతం ఐపీఎల్ పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ముందు ముందు పుంజుకుంటుందన్న నమ్మకం కూడా… ఆ జట్టు యాటిట్యూడ్ వల్ల పోయే పరిస్థితి ఏర్పడింది.