అవును.. విజయవాడలో పండుగ కళ కనిపించడం లేదు…ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలు.. ఈ ఏడాది మాత్రం మునుపటి కళ లేకపోవడంతో పట్టణం బోసిపోయినట్టు కనిపిస్తోంది.
ఇటీవలి వరదల కారణంగా విజయవాడ సహా బుడమేరు పరిసర గ్రామాల ప్రజలు ఈ ఏడాది వినాయక చవితి పండుగకు దూరంగా ఉన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది బెజవాడలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దుర్గమ్మ సన్నిధిలో పెద్ద విగ్రహాన్ని పెట్టి అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. కాని, ఈ ఏడాది మాత్రం వరదలు విషాదాన్ని నింపడంతో బెజవాడలో వినాయక చవితి ఉత్సవాల కళ కనిపించడం లేదు .
వరద విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు.. దాంతో కాలనీల్లో పెద్ద, పెద్ద విగ్రహాలను పెట్టి వేడుకలు నిర్వహించేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు . ప్రతి ఏటా వినాయక చవితి సమయంలో డీజే చప్పుళ్ళతో మార్మోగే బెజవాడ ఈసారి మాత్రం వరదల కారణంగా నిశ్శబ్దంగా మారింది.
ఇక, వరద ప్రభావం తగ్గడంతో విజయవాడలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సిఎం అధికారులను ఆదేశించడంతో ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.