రాజకీయ పార్టీలకు జన ప్రదర్శనే బల ప్రదర్శన..! సభలకి ఎంతమంది జనాల్ని తరిలించగలిగితే అంత బలమున్న పార్టీ అన్నట్టు..! జనాలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చే రోజులు ఏనాడో పోయాయి. జన సమీకరణ అనేది ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది. దానికి ప్రత్యేకంగా బడ్జెట్, పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిందే. ఆ రకంగా రాజకీయ పార్టీలే జనాల్ని మార్చేశాయని కూడా చెప్పుకోవాలి. పులిహోరా ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, దారి ఖర్చులు.. ఇలాంటివన్నీ అలవాటు చేసేశాయి. పార్టీపైనా లేదా నాయకుడిపైనా అభిమానంతో ప్రజలు తరలి వస్తారా…? వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఓ కొత్త సంస్కృతికి తెరాస తెర తీసే ఆలోచనలో ఉంది..!
పార్టీ ఆవిర్భావ సభను ప్రతీయేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది తెరాస. భారీ ఎత్తున జన సమీకరణ చేస్తుంది. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు పెద్ద ఎత్తున జనాల్ని సమీకరిస్తారు. ఈ సమీకరణకు కావాల్సిన ఖర్చు వెచ్చాలన్నీ పార్టీ భరిస్తుంది. ముందుగానే కొన్ని నిధులు కేటాయించి, స్థానిక నేతలకు అందజేస్తుంది. అయితే, ఈసారి అలాంటివేవీ ఉండవని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించడం విశేషం. ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు వచ్చేవారు.. స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పార్టీగానీ, సర్కారుగానీ దారి ఖర్చులకుగానీ మరేదైనా పేరుతోగానీ సొమ్ము ఇవ్వదని స్పష్టం చేశారు.
ఈ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధమౌతున్నారని కడియం చెప్పడం విశేషం! కార్యకర్తల ఖర్చులకు కావాల్సిన సొమ్మును శ్రమదానం ద్వారా సమకూర్చుకోవాలని కడియం సూచించారు. సీఎం కేసీఆర్ కూడా శ్రమదానం చేస్తారనీ, త్వరలోనే ఆ తేదీలని కూడా ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
నిజానికి, ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది. డబ్బు ప్రసక్తి లేకుండా బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం ఏ పార్టీకీ లేదు. సొమ్ము బయటకి తీస్తే తప్ప.. జనాలు బయటకి రారు అనే ఒక అభిప్రాయం దాదాపు స్థిరపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడం అనేది సాధ్యమా అనేది ప్రశ్న..? సభలకు అవసరమైన ఖర్చుల్ని కార్యకర్తలే శ్రమదానం ద్వారా సమకూర్చుకోవడం కూడా వినడానికి మంచి కాన్సెప్టే. కానీ, ఇలాంటి కొత్త ఆలోచనలను కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా వేచి చూడాలి. తెరాస అనుకున్నట్టుగానే అన్నీ జరిగితే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.