అమరావతిని మార్చనే మార్చబోము… కావాలంటే.. మేనిఫెస్టోలో పెడుతామంటూ.. చెప్పుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చివరికి .. అమరావతి, రాజధాని అనే ప్రస్తావనే లేకుండా మేనిఫెస్టోను ప్రకటించింది. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజధానిని మారుస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అందుకే.. ఆ పార్టీకి చెందిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. రాజధాని అమరావతిలోనే ఉంటుందని నమ్మించడానికి మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారు. తీరా చూస్తే.. రాజధాని నిర్మాణం, అమరావతి అనే అంశాలను మేనిఫెస్టోలో వైసీపీ ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా.. ఇంత వరకూ.. ఏ సందర్భంలో అయినా.. ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో అయినా.. జాతీయ మీడియా ఇంటర్యూల్లో అయినా జగన్మోహన్ రెడ్డి.. రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తారా.. అంటే… ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడేదో పెద్ద స్కాం జరుగుతుందని చెప్పుకొచ్చారు కానీ.. ఎప్పుడూ… అక్కడే రాజధాని ఉంటుందని .. నొక్కి చెప్పలేదు. చివరికి..మేనిఫెస్టోలో పెడతామని చెప్పి కూడా… చివరికి ఆ ప్రస్తావన లేకుండా చేశారు.
దీంతో.. అమరావతి, నవ్యాంధ్ర రాజధాని విషయంలో.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వేరుగా ఉన్నాయన్న అభిప్రాయం… ప్రజల్లో ఏర్పడుతోంది. రాజధాని కోసం.. ఇప్పటికే.. రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రూ. 50 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సమయంలో… రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కోసం అయినా.. జగన్మోహన్ రెడ్డి రాజధానిని మార్చబోమనే… హామీని ఇస్తారని.. ఆశించారు. కానీ అలాంటి ప్రయత్నమే జరగలేదు. మొదటి నుంచి రాజధానిపై.. జగన్మోహన్ రెడ్డి విముఖంగా ఉన్నారు. అమరావతి శంకుస్థాపనకు రాలేదు. ఆ తర్వాత ఏ సందర్భంలోనూ.. రాజధాని గురించి పాజిటివ్‌గా లేరు. ఇప్పుడు మేనిఫెస్టోలోనూ పెట్టలేదు.
మేనిఫెస్టోలో పెడతామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేసిన ప్రకటనకు కూడా విలువ లేకుండా పోయింది. అమరావతి అభివృద్ధి చెందితే.. హైదరాబాద్ కు డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే… రాజధానిని జగన్ సాయంతో అడ్డుకునే ప్రయత్నాన్ని.. కేసీఆర్ చేస్తున్నారని… కొంత కాలంగా టీడీపీ నేతలు చేస్తున్నారు. పొరుగున ఉన్న మూడు రాష్ట్రాలకు.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలు ఉన్నాయి. వాటి మధ్య ఏపీ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుంది. అమరావతి అభివృద్ధి చెందితే.. ఆయా రాష్ట్రాలకు ధీటుగా.. ఏపీ నిలబడుతుంది. కానీ ఈ విషయంలో ప్రతిపక్షం వ్యవహారం తేడాగా ఉంది.