మరో నాలుగు రోజుల్లో ‘ఆదిపురుష్’ని వెండి తెరపై చూసేయొచ్చు. ఇప్పటికైతే ఈ సినిమాపై బజ్ బాగానే ఉంది. కాకపోతే… చిత్ర బృందం ప్రమోషన్లపై దృష్టి పెట్టడం లేదు. ఆదిపురుష్‌కి సంబంధించిన ఒక్క ఈవెంట్ కూడా ఇప్పటి వరకూ హైదరాబాద్‌లో చేసింది లేదు. తిరుపతిలో ప్రీ రిలీజ్వేడుక గట్టిగా నిర్వహించారు. అక్కడితో ఈ ప్రమోషన్లకు ముగింపు పలికినట్టే అనిపిస్తోంది. ప్రభాస్ అమెరికా వెళ్లిపోయాడు. కృతి సనన్, ఓం రౌత్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. వాళ్లేమో.. నార్త్ సైడ్ ప్రమోషన్లలో బిజీ. వాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి, ప్రమోషన్లు చేయించినా అది సరిపోదు. ఓ తెలుగు హీరోతో పాన్ ఇండియా సినిమా తీసి, హైదరాబాద్‌లో ఒక్క ఈవెంట్ కూడా చేయకపోవడం… ఇదే తొలిసారి అవుతుందేమో..? 15న ఏపీ, తెలంగాణలలోని కొన్ని ముఖ్యమైన నగరాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారని ఆశించారు. కానీ.. అలాంటి ఏర్పాట్లేం ఇంత వరకూ జరగలేదు.
ఆదిపురుష్ కి ప్రమోషన్లు చేసినా, చేయకపోయినా.. ఓపెనింగ్ డే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిపురుష్‌కి భయపడే… చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. 16న దేశ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’కి సోలో రిలీజ్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేసుకోవడం అవసరం. కానీ ఆదిపురుష్ టీమ్ ఆ దిశగా ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.