అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గత ఆరు నెలల నుంచి కూడా పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అవంతీ శ్రీనివాస్ మొదటి నుంచీ కూడా తనకు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందని, భీమిలీ అసెంబ్లీ టిక్కెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అది ఎలా ఇస్తామని తెలుగుదేశం వర్గాలు తటపటాయించాయి. ఎన్నికలు సమీపిస్తున్నా తనకు హైకమాండ్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో అవంతి శ్రీనివాస్ తెలుగుదేశాన్ని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతి రోజే ముహుర్తం పెట్టుకున్నారు.
అవంతి శ్రీనివాస్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి టచ్ లో ఉన్నారు. ఆయనతో భేటీ అయ్యారు. జగన్ ను కలిసి లాంఛనంగా పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం హైకమాండ్ మాత్రం అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం పై ఎటువంటి స్పందనా వ్యక్తం చేయకూడదని, ఆయన వద్దకు రాయబారం పంపకూడదని కూడా నిర్ణయించుకుంది. అవంతి పార్టీని వీడితే తమకే లాభమని, టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, వంటి పలువురు నేతలు తెలుగుదేశంలోకి వచ్చేందుకు సిద్దంగా ఉండటంతో వారితో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని భర్తీ చేయవచ్చనే భావనలో ఉన్నారు. మధ్యే మార్గంగా విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని అవంతికి ఇద్దామని టీడీపీ అధినాయక్తవం అనుకుంది. ఈ లోపే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో వదిలేసింది.
ఎన్నికల సమయంలో.. టిక్కెట్ల కోసం.. పోయేవాళ్లు పోతుంటారని.. అలాంటి వాళ్ల విషయంలో లైట్ తీసుకోవడమే మంచిదని.. చంద్రబాబు చెబుతున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ను పిలిపించి మాట్లాడి తప్పు చేశామనే అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. ఇంత కాలం పార్టీలో ఉన్నందున అసంతృప్తి ఎందుకో తెలుసుకుని పరిష్కరించి గౌరవిద్దామనే ఆలోచనతోనే పిలిచారు కానీ.. వాళ్లు లేకపోతే.. పార్టీకి నష్టమని కాదని.. టీడీపీ అగ్రనేతలు విశ్లేషించారు. ఎన్నికల సమయంలో.. ఇక ఎవరు పార్టీ వీడతారని ప్రచారం జరిగినా.. బుజ్జగింపుల్లాంటివేమీ పెట్టుకోకూడదని.. నిర్ణయించారు. అవంతి శ్రీనివాస్ వ్యవహారానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.