మొన్న గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీమాన్ వైసీపీలో చేరారు. ఓ సాధారణ కార్యకర్తగా ఉన్న ఆమెను… జడ్పీ చైర్‌పర్సన్‌ను చేశారు టీడీపీ అధినేత. ఆమె ఎందుకు పార్టీ నుంచి వెళ్లిపోయిందో ఎవరికీ తెలియదు. ఎన్నికల సందర్భంగా ఏ టీడీపీ నేతా తనను పలకరించలేదని.. తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని.. ఆమె నమ్మలేకపోయారు. అదే సమయంలో… ఇలాంటి వారి కోసం.. ఓ ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసుకున్న వైసీపీ.. చర్చలు జరిపి పార్టీలో చేర్చేసుకుంది. వైసీపీలో చేరే వరకూ.. టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అలాంటివి చాలా ఉన్నాయి. నిన్నటికి నిన్న కర్నూలు నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి, మంగళగిరి నుంచి కాండ్రు కమల వెళ్లి పార్టీలో చేరారు. నిజానికి ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా.. సోదరి కుమార్తె, ఆమె సోదరుడు.. శోభా నాగిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. వారి విజయం కోసం ప్రయత్నించాల్సింది.
కానీ.. ఆయన వైసీపీలో చేరారు. టీడీపీ నేతలు పట్టించుకోకపోవడమే దీనికి కారణం. కాండ్రు కమల కూడా అంతే. మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నారు. ఆమె రాజకీయ అవకాశాలపై కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో… వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో ఇలాంటి హామీలను లెక్కకు మిక్కిలిగా ఇచ్చి చేర్చుకుంటున్నారు. ఇప్పటికి రెండు వందల మందికి ఎమ్మెల్సీ హామీలను జగన్ ఇచ్చారంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన తెలుగుదేశం రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈయనతో పార్టీ సరైన సమయంలో మాట్లాడలేకపోయింది. తాను అసంతృప్తిగా ఉన్నానని, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం, అన్యాయమని శ్రీనివాస యాదవ్ బహిరంగంగానే చెప్పారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఉన్న కొంతమంది నేతలు ఆయన తో మాట్లాడారు. స్థానికంగా ఉండే నేతలందరినీ వెళ్లి ఆయనతో మాట్లాడాలని పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో జరిగిన జాప్యంతో శ్రీనివాస యాదవ్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో మాచర్ల టిక్కెట్ ఇచ్చినా… పోటీ చేయలేనన్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా రాలేదు.
ఎన్నికల సమయంలో టిక్కెట్లు రాని నేతలు, అసంతృప్తికి గురైన ద్వితీయ శ్రేణి నాయకత్వం అలకపాన్పు ఎక్కుతుంటుంది. ఇది ఏపార్టీలో అయినా సహజంగా జరిగే పరిణామమే. ఇటువంటి నేతలందరినీ బుజ్జగించి వారిని పార్టీలోకి తీసుకురావడం, పోటీ చేయబోయే అభ్యర్ధులతో కలిపి సమన్వయం చేయడం, అందరూ కలిసి ఐకమత్యంగా ప్రచారానికి వెళ్లడం వంటి అంశాలను ఓ కమిటీ చూసుకోవాల్సి ఉంటుంది. సీనియర్ నేతలను ఆ కమిటీలో నియమించి ఏయే నియోజకవర్గాలలో ఇటువంటి అసంతృప్తి ఉందో అటువంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని అక్కడ ఉన్న నేతలను పిలిపించి లేదా అక్కడకే వెళ్లి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా చేస్తే పార్టీ మొత్తం సమన్వయంతో ముందుకు వెళుతుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలు ఎక్కువై పోయారు. ఎవరు ఏది అడిగినా అన్నీ చంద్రబాబు చూసుకుంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.