ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు చూసి నోరు వెళ్లబెట్టని సామాన్యుడు ఎవరూ ఉండరు. ఓ వైపు తుపానుతో తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందో లెక్కలు ఇంకా తేలలేదు. కొన్ని వేల మంది ఇళ్లు కోల్పోయారు. లక్షల మంది ఆస్తులు నష్టపోయారు. రోడ్లు సర్వనాశనం అయ్యాయి. విద్యుత్ వ్యవస్థ చిందరవందర అయింది. ఇలాంటి సమయంలో అధికారంలో ఉండే.. బాధ్యత గల పాలకుడు చేయాలి ? ఏపీలో ఏం చేస్తున్నారు.
ఏపీలో అసలు ఏమీ జరగనట్లు పెళ్లిళ్లు, శంకుస్థాపనలకు షిక్కటి చిరునవ్వుతో జగన్ రెడ్డి
తుపాను ముగిసింది. ఇక సాధారణ పరిస్థితులు రావాలి అని సీఎం జగన్ రెడ్డి సమీక్ష చేసిచెప్పినట్లుగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఆయన సమీక్ష చేశారో లేదో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన పెళ్లిళ్లకు హాజరయ్యారు. తన ట్రేడ్ మార్క్ హావభావాలతో అందర్నీ పలకరించారు. ఈ రోజు దుర్గ గుడిని ఉద్దరించేస్తానని శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఎప్పుడో నాలుగేళ్లకిందట దుర్గ గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటి పనులు అంగుళం కదల్లేదు. కానీ మళ్లీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తున్నారు కానీ.. వరద బాధితుల గురించి మాత్రం పట్టడం లేదు.
రీల్స్ చేసుకుంటున్న రోజా – ముసుగు తన్నేసిన మంత్రులు
ఓ వైపు వరదలు వచ్చి రైతులు తంటాలు పడుతూంటే… రోజా రీల్స్ చేసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుని మురిసిపోతున్నారు. ఇటీవలి కాలంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సోషల్ మీడియా టీమ్ ను నియమించుకున్నారేమో కానీ.. పళ్లు తోముకునే దగ్గర్నుంచి అన్ని పనులు వీడియోలు తీయించుకుని అప్ లోడ్ చేయించుకుంటున్నారు. ఆమె అలా ఉంటే.. వరదల్లో ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న మంత్రులు ముసుగుతన్నేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యవసాయమంత్రే కాదు రోడ్ల మంత్రికీ పట్టింపు లేదు.
తుపాను బాధితులు అనాథలా ?
ఏపీలో తుపాను బాధితుల్ని జగన్ రెడ్డి సర్కార్ అనాథల్లా వదిలేసింది. నష్టం .. పరిహారం దాకా కాదు..అసలు తుపాను వస్తున్నప్పుడే పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది. తుపాను అయిపోయింది కదా మీ బాధలు మీరు పడండని గాలికి వదిలేసింది. ఇంత ఘోరమైన నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని చరిత్రలో చూసి ఉండరని… ప్రజల్ని అనాథల్లా వదిలేసే సర్కార్ ఉండదని విమర్శలు వస్తున్నా… తుడిచేసుకుంటున్నారు.