కవిత అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్షసాధింపు అని కేటీఆర్ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. కానీ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై అందరూ మండిపడుతున్నారు. కానీ కవిత విషయంలో సపోర్ట్ చేసేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఎవరో ఎందుకు… గత పదేళ్లుగా రాజకీయంగా కలిసి తిరిగిన జగన్ కూడా ముందుకు రాలేదు. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని.. కవిత అరెస్ట్ అక్రమం అని ఒక్క మాట కూడా వైసీపీ వైపు నుంచి రాలేదు.
ఇక ఇతర పార్టీలు ఏవీ పట్టించుకోలేదు. దీనికి కారణం గతంలో ఆయా పార్టీలు కష్టం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేయకపోగా మరింత గా కించపరిచేలా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాల్సిన పని లేదు. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానరాకుండా వ్యవహరించే వారికి అధికారం పోయిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడనికి తమకు మద్దతు కోసం.. విచిత్రమైన పనులు చేస్తూంటారు. అవి నవ్వుల పాలవడం తప్ప.. సపోర్ట్ లభించదు.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై గతంలో చాలా పార్టీలు పోరాటం చేశాయి. కానీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్ల కిందట .. ఈ అంశంపై స్పందిస్తే.. .ఆ ట్వీట్ ను రీట్వీట్ చేశారు కానీ.. అప్పట్లో ఎందుకు మద్దతు చెప్పలేదన్నది అందరికీ వచ్చిన డౌట్. అప్పట్లో బీజేపీతో గుడ్ టర్మ్స్ తో ఉన్న కేసీఆర్….కేటీఆర్ తప్పు చేయకపోతే భయమెందుకు అని ఎగతాళి చేశారు. వారి మాటల్ని ఎవరైనా మర్చిపోతారా ?. మరి ఇప్పుడు టీడీపీ ఎలా మద్దతుగా వస్తుంది. దర్యాప్తు సంస్థల వ్యవహారంపై రాహుల్ గాంధీ స్వయంగా బాధితుడు. ఆయన ఎన్ని సార్లు ఈ దర్యాప్తు సంస్థల నిర్వాకంతో బాధితులయ్యారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు పార్టీకి ఎన్నికల ఖర్చుకు అందకుండా ఖాతాల్లో ఉన్న సొమ్మును కూడా ఐటీ విభాగం సీజ్ చేసింది. గత పదేళ్లుగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ .. దర్యాప్తు సంస్థల చేతిలో అత్యంత దారుణంగా బాధితులుగా మిగిలారు. వాటిని ప్రయోగించి పార్టీ నేతల్ని లాక్కున్నారు.
ఎన్ని జరుగుతున్నా.. చివరికి మమతా బెనర్జీ సహా ఎవరి మీద దర్యాప్తు సంస్థలు విరుచుకుపడినా బీఆర్ఎస్ మద్దతివ్వలేదు. ఇప్పుడు అవి కూడా ఇవ్వవు. విచిత్రం ఏమిటంటే… దోస్త్ జగన్ కూడా నోరు తెరవడానికి భయపడుతున్నారు.