ఆవిర్భావ సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి బలప్రదర్శన చేయాలనుకుంటున్న జనసేనకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చేలా ఉంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా జాతీయ రహదారికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో సభా వేదికను ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ.., ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించుకుంటున్నప్పటికీ.. అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. మార్చి 14న జరిగే సభకు అనుమతి కోసం గత నెల 28వ తేదీన పర్మిషన్ ఇవ్వాలని.. సహకరించాలని డీజీపీ కోరినా సహకరించడం లేదని జనసేన నేతలు మండి పడుతున్నారు.
ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని గుర్తించి…జనసేన నిర్వహణపై పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు వైసీపీ.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని సభ నిర్వహణ బాధ్యతను తీసుకున్న నాదెండ్ల మనోహర్ మండి పడుతున్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫైర్ చలానాలు కూడా కట్టలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కోవిడ్ నిబంధనలు అమల్లో లేవు. అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయి.
అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగాపవన్ కోసం అయితే ప్రభుత్వమే కదిలి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జనసేనకు ఓ సవాల్‌గా మారిందనిచెప్పుకోవచ్చు. హైకోర్టు అనుమతితో సభ నిర్వహంచాలని జనసేన గట్టి ప్రయత్నాలు చేస్తోంది.