పద్మ అవార్డుల విషయంలో తెలుగువాళ్లకు మరోసారి మొండి చేయే ఎదురైంది. కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 110 మందికి పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీలు ప్రకటించింది. తెలుగు చిత్రసీమ నుంచి ఒక్కరూ పద్మలకు నోచుకోలేదు. బాలీవుడ్ నుంచి మాత్రం కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నాన్ సమీలకు పద్మలు వరించాయి. నిజానికి ఈసారి పద్మ అవార్డులలో సినిమా రంగం ఎక్కువ మెరవలేదు. అందునా తెలుగులో ఒక్క పేరూ కనిపించలేదు. కైకాల సత్యనారాయణ, రాఘవేంద్రరావు లాంటి హేమా హేమీలకు పద్మలు వస్తాయని భావించారు. కైకాల అయితే ఎప్పటి నుంచో పద్మశ్రీ కోసం వెయిటింగ్. ఆయనకు ఈసారైనా వస్తుందేమో అనుకున్నవాళ్లకి నిరాశ ఎదురైంది. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటి నుంచీ మనవాళ్లకు పద్మశ్రీలు అందడం లేదు. ఎవరు ఎవరి కోసం సిఫార్సు చేస్తున్నారో అర్థం కాకపోవడం ఒక కారణమైతే, ‘వాళ్లు చూసుకుంటారులే’ అని తెలంగాణ ప్రభుత్వం, ‘వీళ్లు చూసుకుంటారులే’ అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా రంగాన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు.