పవన్ కల్యాణ్‌కు ల్యాండింగ్ చిక్కులు ఎదురవుతున్నాయి. నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాకు వెళ్తే..ఆయన హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు.. ఢిల్లీ నుంచి అనుమతి రాలేదని.. మండి పడ్డారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించకపోవడంతో.. ఆ జిల్లా ప్రచార కార్యక్రమాల్ని పవన్ కల్యాణ్ రద్దు చేసుకున్నారు. గాజువాకలోనే ఎక్కువ సేపు ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల అగ్రనేతలు.. హెలికాఫ్టర్లలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా.. హెలికాఫ్టర్లు బుక్ చేసుకున్నారు. రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా.. తమ పార్టీకి ఎక్కడ ఊపు కావాలో అక్కడ ప్రచారం చేస్తున్నారు.
మామూలుగా అయితే.. ఈ టూర్లకు ఎలాంటి చిక్కులు వచ్చి ఉండేవి కావు. కానీ.. ఒకే జిల్లాలో.. అదీ ఒకే చోట.. ఇద్దరు హెలికాఫ్టర్లలో వచ్చి వాలి ప్రచారం చేయాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. చంద్రబాబు పర్యటనకు ముందుగానే అనుమతి తీసుకున్నారు. సమయం ఆదా చేసుకోవడం కోసం.. హెలికాఫ్టర్ లోనే ప్రచారసభలకు వెళ్తున్నారు. పవన్ కూడా అదే సమయంలో శ్రీకాకుళం వెళ్లాలని అనుకోవడంతో… పర్మిషన్ రాలేదు. విశాఖలోనే ఉండిపోయారు. జగన్ కు ఇలాంటి సమస్య రాలేదు. చంద్రబాబు రాయలసీమలో ప్రచారం చేస్తున్నప్పుడు జగన్ కోస్తాలో.. చంద్రబాబు కోస్తాలో ఉన్నప్పుడు… జగన్ సీమలో ప్రచారం చేస్తున్నారు. దీంతో.. హెలికాఫ్టర్ పర్మిషన్ రద్దు చేయడం లాంటి సమస్యలు రాలేదు.
కొసమెరుపేమిటంటే.. తాను కూడా హెలికాఫ్టర్ ను బుక్ చేసుకున్నానని.. కానీ.. చంద్రబాబు, జగన్ క్యాన్సిల్ చేయించారని.. కేఏ పాల్ చెప్పారు. ఆయన పార్టీ గుర్తు హెలికాఫ్టరే. అందుకే.. ఆ తనకు హెలికాఫ్టర్ లేకపోయినా.. తన పార్టీ గుర్తుతో జగన్, చంద్రబాబు..తనకు ప్రచారం చేస్తున్నారని .. ఆ క్రెడిట్ అంతా ఖాతాలో వేసుకుంటున్నారు.