ఓ హిట్ సినిమా వస్తే… హీరో, నిర్మాత, హీరోయిన్ మాత్రమే కాదు.. దర్శకుడూ లాభపడతాడు. ఫస్ట్ షో పడి, టాక్ బయటకు రావడమే ఆలస్యం… దర్శకుడి కోసం కర్చీఫ్‌లు వేసేస్తుంటారు నిర్మాతలూ, హీరోలు. అడ్వాన్సులు తీసుకోవాలన్న ఒత్తిడి, రికమెండేషన్లు షరా మామూలే. అయితే జై లవకుశ తరవాత.. ఈ తరహా తాకిడి బాబి విషయంలో కనిపించడం లేదు. సరికదా, కనీసం విశ్లేషకులు, అభిమానులు, చిత్రబృందం బాబీ ప్రస్తావనే మర్చిపోయారు. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఇరగదీశాడని, జై పాత్రని అద్భుతంగా పండించాడని, తన ఖాతాలో మరో హిట్ అని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి గానీ.. బాబి ‘దర్శకత్వ ప్రతిభ’ని ఎలిగెత్తి చాటినవాళ్లు లేరు. నిజానికి కథ విషయంలో బాబిని ఎవ్వరూ పెద్దగా విమర్శించడం లేదు గానీ.. ఈ కథని ఇంకా బాగా తీయాల్సిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలు బలంగా ఉన్నా, వాటిని కావల్సిన స్థాయిలో బాబి ఎలివేట్ చేయలేకపోయాడని విశ్లేషకులు తేల్చేశారు. పైపెచ్చు కథనంలో బోలెడన్ని లోటుపాట్లు, లోపాలు వెలికి తీశారు. ఇదంతా బాబిపై ఎఫెక్ట్ చూపించే విషయాలే.
దానికి తోడు ఈ సినిమా ప్రారంభం నుంచీ బాబీపై నెగిటీవ్ వార్తలు జోరందుకొన్నాయి. బాబి ని పక్కన పెట్టి ఎన్టీఆర్, చోటా కె.నాయుడు ఈ సినిమాని లాగించేశారని, బాబి పాత్ర నిమిత్తమాత్రమని చెప్పిన వాళ్లున్నారు. అందుకే బాబికి ఈ సినిమా రిజల్ట్‌పై కంటే తనకు దక్కే క్రెడిట్పైనే ఎక్కువ బెంగ ఉండేది. సినిమా హిట్ అయితే.. ఎన్టీఆర్‌ని మోసేస్తారని, తేడా వస్తే తనని విమర్శిస్తారని బాబికి బాగా తెలుసు. ఇప్పుడు అదే నిజమైంది. జై లవకుశ క్రెడిట్ ఎన్టీఆర్ ఖాతాలో చేరిపోయింది. అందుకే.. బాబి ఈ హిట్‌ని సరైన రీతిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాడన్నది విశ్లేషకుల మాట.