పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రెస్మీట్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కి సరిసమానమైనది ఏది లేదని కమిటీ అభిప్రాయపడ్డట్టు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల వాగ్దానం ఎన్డీఎ చేసిందని , ఎన్నికలయిన తర్వాత ఆ వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం మరచిపోయిందని అన్నారు.
గతంలో సర్దార్ వల్లభాయి పటేల్ ని రాజ భరణం విషయంలో కొంతమంది ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. అసలు రాజభరణమ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని కొంతమంది పటేల్ తో వాదించారు. అయితే అందుకు పటేల్ సమాధానమిస్తూ రాజ భరణం ఇస్తామని మనం పార్లమెంటులో వాగ్దానం చేశాం. అలా పార్లమెంటులో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే ప్రజల్ని పాలించే నైతిక హక్కుని మనం కోల్పోతాం అని పటేల్ అన్నారు . ఈ విషయాన్ని గుర్తుచేస్తూ పవన్ కళ్యాణ్ , సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నిర్మించిన పాలకులు, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే పాలించే హక్కు కోల్పోతామన్న పటేల్ మాాటలు గుర్తు చేసుకోవాలి అని అన్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు తాను వాటిని పాచిపోయిన లడ్డూ తో పోలిస్తే, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తమకు పాచిపోయిన లడ్డూ చాలు అన్నట్టుగా ప్రవర్తించారని, కానీ ఇప్పుడు ఆ పాచిపోయిన లడ్డూ కూడా కేంద్రం తమకు ఇవ్వలేదని పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ రోజే రాష్ట్రప్రభుత్వం హోదా కోసం పట్టుబట్టి ఉండాల్సిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హోదా విషయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు .
మొత్తానికి పవన్ నివేదిక బయటికి వచ్చినప్పటికీ , చెప్పిన విషయం బాగానే ఉన్నప్పటికీ, ఆయన తదుపరి కార్యాచరణ మీద స్పష్టత రాకపోవడం గమనార్హం .