మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేయనుందా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు,థర్మల్ పవర్ ప్లాంట్లలో అవకతవకలపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మదన్ బీ లోకూర్ నుంచి కేసీఆర్ కు పిలుపు అందనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి , భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పవర్ కమిషన్ వర్క్ షురూ చేసింది. ఈమేరకు గత కొద్ది రోజులుగా పవర్ కమిషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలో ఈ విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారమే కమిషన్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మదన్ బీ లోకూర్ ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్టడీ చేశారని సమాచారం.
ఈ అంశంపై లోతైన సమాచారం కోసం గతంలో పవర్ కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ నరసింహ రెడ్డి ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించారు. విద్యుత్ రంగానికి చెందిన అధికారులు, ఇంజినీర్ల ద్వారా ఆయన సమాచారం తెప్పించుకున్నారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డితోపాటు కేసీఆర్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం, దీనిపై సుప్రీంకోర్టు తీర్పుతో నరసింహ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత పవర్ కమిషన్ నూతన చైర్మన్ గా నియామకమైన జస్టిస్ మదన్ బీ లోకూర్ కీలకమైన డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం కేసీఆర్ ను విచారణకు హాజరు కావాలని కోరుతారా? ఆయనకు నోటీసులు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.