ఎన్టీఆర్ మామూలు మాటకారి కాదు. అలాగే, మంచి చమత్కారి కూడానూ. మహేశ్ బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్… సినిమా నేపథ్యానికి ముడిపెట్టి రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ‘భరత్ బహిరంగ సభ’లో ఆయనలోని మాటకారిని, చమత్కారిని చూపించాడు.
“నందమూరి తారక రామారావుగారి మనవణ్ణి అయిన నేను” అంటూ స్పీచ్ మొదలుపెట్టి… “మా ఇద్దర్నీ (మహేశ్, ఎన్టీఆర్) ఇలా చూడడం మీకు (ప్రేక్షకులకు) కొత్తగా వుందేమో. నాకు మాత్రం లేదు. నేను ఆయన్ను మహేశ్ అన్న అని పిలుస్తుంటాను” అని ఇద్దరి మధ్య స్నేహం గురించి చెప్పకనే చెప్పాడు. ఇక, సభలో ఆయన్ను ముఖ్య అతిథి అంటుంటే… నేను ముఖ్య అతిథిని కాదన్నాడు. మహేశ్ అన్న కుటుంబ సభ్యుడిగా వచ్చానంటూ అందరి మనసుల్ని మీటాడు. అభిమానుల మధ్య అంతరాలను తగ్గించే ప్రయత్నం చేశాడు. మహేశ్ అందం గురించి మాట్లాడనంటూ… ‘మహేశ్ అందగాడు’ అనే విషయాన్ని చెప్పి తనలోని మాటకారిని చూపించాడు ఎన్టీఆర
హీరోగా మహేశ్ బాబుని అరుదైన రకంగా ఎన్టీఆర్ అభివర్ణించాడు.”నటుడిగా మహేశ్ స్థాయి గురించి, హీరోగా ఆయన స్టామినా గురించి అందరికీ తెలుసు. కమర్షియల్ హీరో అయ్యుండి… ఆయన చేసినటువంటి ప్రయోగాలు నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఫలితాలతో సంబంధం లేకుండా అదే బాటలో నడిచారు. ఒక రకంగా ఇప్పుడిప్పుడు ప్రయోగాలు చేయడం మొదలుపెడుతున్న మాకు ఆయనే స్ఫూర్తి. మహేశ్ అన్న గురించి చెప్పాలంటే… శివ (దర్శకుడు కొరటాల), నేను చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది. సినిమాలో రాజీవ్ కనకాల ఇంటికి వెళ్లిన సన్నివేశంలో ‘అమ్మా… మా ఇంటి బయట ఒక అరుదైన రకం మొక్కను చూశా’ అంటాను. హీరోల్లో మహేశ్ అన్న అరుదైన రకం. ఆయన్ను అలాగే ఉండనిద్దాం. ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్లో మైలురాయిగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా” అని ఎన్టీఆర్ మాట్లాడారు.