రవి :
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు.. తెలుగుజాతి సొంతమవడానికి… సంపూర్ణంగా సహకరించిన కారణం… తెలుగుదేశం పార్టీ. సినిమాలకు పరిమితమై… దేవుడు పాత్ర వేస్తే దేవునిగా.. రాక్షసుని పాత్ర వేసినా… దేవునిగా.. పేరు ప్రతిష్టలు.. కీర్తి పొంది.. వెండితెరపై.. ఎవరూ భర్తీ చేయలేని… కీర్తి శిఖరాలు అందుకున్న ఆయన… ప్రజానాయుకుడిగా మారిన తర్వాతే సంపూర్ణమయ్యారు. అందుకు.. తెలుగుదేశం పార్టీనే కారణం అయింది. మరి ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి..?
యుగపురుషుడి అస్థిత్వానికి ఎందుకీ దుస్థితి..!
వచ్చిండన్నా… వచ్చాడన్నా… అర్థం ఒకటే. యాసలు వేరు అయినా.. తెలుగు వారంతా.. ఒక్కటే. ఇదే సూత్రాన్ని నిజం చేసి… ఎన్టీఆర్ … తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తెలుగుదేశమే… ఇప్పటికీ ఆయన అస్థిత్వం. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ.. అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. దేశవిదేశాలలో ఉన్న.. తెలుగు వాళ్లందరికీ.. తనదైన పనితీరుతో ఓ గుర్తింపు తెచ్చి పెట్టారు. అదంతా.. తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమయింది. కానీ ఇప్పుడా తెలుగుదేశం పార్టీ… కుంచించుకుపోతోంది. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా.. పార్టీని దూరం పెట్టే వర్గాలు ఎక్కువైపోతున్నాయి. పార్టీని కాపాడుకోవడానికి.. ఆ ఎన్టీఆర్‌నే పక్కన పెట్టిన.. పార్టీ యంత్రాంగం.. ఇప్పుడు… అన్ని రకాల అవ్యవస్థలతో… కుంచించుకుపోతోంది.
ఎవరూ చేయని మేళ్లు చేసిన ఎన్టీఆర్ తెలంగాణకు ఎందుకు కానివాడయ్యారు..?
బడుగులకు రాజ్యాధికారం ఇచ్చి… అత్యంత విప్లవాత్మకమైన సంస్కరణలతో.. తెలంగాణ ప్రజలకు… ఓ నిజమైన స్వాతంత్రాన్ని… తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. బడుగు, బలహీనవర్గాల ప్రజలను.. ఎదగకుండా చేసిన అనేక వ్యవస్థలను రద్దు చేసి పడేసి.. వారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చి పెద్ద నేతలను చేసిన చరిత్ర టీడీపీది.. ఎన్టీఆర్‌ది. అందుకే.. తెలంగాణలో తెలుగుదేశం.. ఎప్పుడూ బలంగానే ఉంది. ఆదిలాబాద్ నుంచి… నల్లగొండ వరకూ.. టీడీపీ అంటే ఓ బలీయమైన శక్తి. కానీ అది ఇప్పుడు కాదు. ఇప్పుడు.. తెలంగాణలో ఉనికి లేదు. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి… ఓ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయలేకపోయారు. స్థానిక ఎన్నికల్లో ఉనికి చూపలేపోయారు. అంటే.. ఓ రకంగా ఇప్పుడు.. తెలంగాణలో టీడీపీ లేదు. ఏపీకే పరిమితమయింది. అన్న ఎన్టీఆర్‌ను… తెలంగాణలో తల్చుకునేవారు లేరు. ఆయన చేసిన సేవలు గుర్తుంచుకునేవారు లేరు. దీనికి.. ఎవరు బాధ్యులు..?
మౌలిక సిద్ధాంతాలకు తిలోదకాలిస్తే మొదటికే మోసం రాదా…?
తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది..? కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో పుట్టింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో.. రాసుకుపూసుకు తిరగాల్సిన పరిస్థితి వచ్చి పడింది. జాతీయ రాజకీయాల అవసరాలు.. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో..అనివార్యమని… ప్రస్తుత టీడీపీ అధినాయకత్వం ఎన్ని మాటలు చెప్పినా… టీడీపీ మౌలిక సిద్ధాంతానికి దూరంగా జరిగినట్లే. అంటే.. పునాదులు కదిలిపోయినట్లే. ఇలా చేయాలనుకున్నప్పుడు.. అందర్నీ సంతృప్తి.. మెరుగైన ఫలితాలు తీసుకుని వచ్చినట్లయితే.. అసలు ఇది ఒక విషయమే అయి ఉండేది కాదు. కాంగ్రెస్ తో జత కట్టడం వల్ల… తెలంగాణలో పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ఏపీలోనూ.. దారుణమైన పరాజయాన్ని చవి చూశారు. ఏపీలో నేరుగా పొత్తు పెట్టుకోకపోయి ఉండవచ్చు కానీ.. మొత్తానికి…. పునాదులు కదిలిపోయిన ఫలితాలు… సార్వత్రిక ఎన్నికల్లో వచ్చాయి.
యువనాయకత్వం రావాలి..! మరో వందేళ్లు ఎన్టీఆర్ తారకమంత్రం కావాలి..!
టీడీపీకి వృద్ధాప్యం వచ్చినట్లుగా అనిపించాడనికి మరో కారణం.. ఆనాటి నేతలే. టీడీపీలో ఇప్పటికీ.. ఆ నాటి నేతలే కనిపిస్తున్నారు. కోడెల నుంచి యనమల వరకూ.. అందరూ వాళ్లే. చరిష్మా ఉన్న యువనేతలకు పెద్దగా ప్రొత్సాహం దక్కడం లేదు. రామ్మోహన్ నాయుడు లాంటి వారసులు.. టీడీపీపై ఆశ రేపుతున్నప్పటికీ.. జనం నుంచి వచ్చే యువనేతలకు తగినంత ప్రొత్సాహం లభించడం లేదు. యువ నాయకత్వం లేకపోవడంతోనే.. యువకుల్లో.. టీడీపీకి ఆదరణ లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇది కచ్చితంగా.. టీడీపీ అగ్రనాయకత్వం వైఫల్యమే..! . తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి.. ఎన్నైనా విశ్లేషణలు చేయవచ్చని.. అందరికీ అనిపించవచ్చు కానీ… తప్పులు తెలుసుకుని మార్చుకుంటూ పోయినప్పుడే విజయం మళ్లీ దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా.. ప్రజల్లో నిలబడుతుందో.. అంత వరకూ మాత్రమే.. ఎన్టీఆర్.. చిరస్మరణీయుడిగా ఉంటారు. రాజకీయమంటే అంతే మరి..! దాని కోసమైనా.. మళ్లీ ఎన్టీఆర్‌ను బతికించాల్సి ఉంది. టీడీపీని పునరుజ్జీవింప చేయాల్సి ఉంది..! .. జోహార్ ఎన్టీఆర్..!