బయోపిక్‌లు తెలుగు తెరకు బొత్తిగా కొత్త. ‘మహానటి’ పేరుతో ‘సావిత్రి’ బయోపిక్ వస్తోందన్నప్పుడు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. సావిత్రి గురించి తెలిసినవాళ్లు మాత్రం ఆమె కథని ఎలా చెబుతాడో చూద్దాం లే… అన్నట్టు ఆ సినిమా వచ్చేంత వరకూ ఎదురుచూశారు. బయోపిక్ ఎలా తీయాలో, ఎలా తీస్తే జనం చూస్తారో, అసలు బయోపిక్‌లలో ఉన్న కమర్షియాలిటీ ఏమిటో… ఆ సినిమాతో నాగ అశ్విన్ చూపించేశాడు. అప్పటికే కొన్ని బయోపిక్‌లు లైన్లోకి వచ్చేశాయి. ‘మహానటి’ని చూశాక… రాబోతున్న బయోపిక్‌లపై ఆశలు, అంచనాలు పెరిగాయి. అలా.. నెత్తిమీద ఎన్నో బరువులు మోసుకుంటూ వచ్చింది ‘ఎన్టీఆర్’ బయోపిక్. ‘మహానటి’ బయోపిక్‌లకు ఓ పాఠంలా మారితే… ‘ఎన్టీఆర్’ ఓ గుణ పాఠంలా మిగిలిపోయింది.
స్టార్ బలం ఉంటే సరిపోదు
మహానటి తో పోలిస్తే… ఎన్టీఆర్‌లో బోలెడుమంది స్టార్లు. ప్రతీ పాత్రకూ స్టార్ వాల్యూ జోడించడానికి శ్రమించింది చిత్రబృందం. స్వతహాగా భారతదేశ మొట్టమొదటి సూపర్ స్టార్ కథ ఇది. అందులో బాలయ్య, విద్యాబాలన్, రానా, కల్యాణ్ రామ్, సుమంత్… ఇలా లెక్కకు మించిన స్టార్లు. చిన్న చిన్న పాత్రల్లో అయినా సరే.. రకుల్, రాశీఖన్నా, షాలినీ పాండే లాంటి వాళ్లూ మెరిశారు. సాంకేతికంగా క్రిష్, కీరవాణి లాంటి పెద్ద పెద్ద కనిపించాయి. అయితే ఇవేం ఈసినిమాని కాపాడలేకపోయాయి. మహానటి విషయానికొస్తే… సమంత, కీర్తి, విజయ్ దేవరకొండ తప్ప.. పెద్ద స్టార్లెవరూ కనిపించరు. కీర్తి, విజయ్‌ల పాత్రలకు కూడా సావిత్రి జీవిత కథలో లేనివి. అంటే సావిత్రి పాత్రకు తప్ప… మరో స్టార్‌ని ఎంచుకోలేదు. అయినా సినిమా నిలబడింది.
సూటిగా సుత్తి లేకుండా…
ఎన్టీఆర్ కథని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నప్పుడు… ఇది కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే ఆలోచన అనుకున్నారంతా. ఒక సినిమాని రెండు సార్లు అమ్ముకోవొచ్చు. రెండు శాటిలైట్లు వస్తాయి. సో… నిర్మాతపై కాసుల వర్షం కురుస్తుంది. అయితే తొలి భాగం ఆడకపోతే… రెండో భాగం చూస్తారా? అనే ఆలోచన రాకుండా పోయింది. ఇప్పుడు అదే జరిగింది. కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో మహానాయకుడిపై ఎవ్వరూ దృష్టి పెట్లలేదు. దాంతో… బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ”ఈ సినిమాని ఒక్క భాగంగా తీసుకుంటే… కథలో వేగం వచ్చేది” అనేది విశ్లేషకుల మాట. చిత్రబృందం కూడా ఈ నిజాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది.
నిజాలు దాస్తే ప్రమాదం
ప్రతీ వ్యక్తి లోనూ ప్లస్సులూ, మైనస్సులూ ఉంటాయి. ఎత్తు పల్లాలుంటాయి. అవన్నీ చూపిస్తేనే అది బయోపిక్ అవుతుంది. `స్ఫూర్తినిచ్చే మంచే చెబుతాం.. చెడుతో పనేముంది?` అనేది సినిమా రూపకర్తల మాట కావొచ్చు. కానీ మంచితో పాటు చెడు, చెడుతో పాటు మంచి ఉండాల్సిందే. ఓ వ్యక్తి జీవితం తెరచిన పుస్తకం అయినప్పుడు… నిజాల్ని నిర్భయంగా చెప్పాల్సిందే. సావిత్రి మద్యానికి బానిస అయ్యిందన్నది నిజం. దాన్ని మహానటిలో దాయలేదు. దానికో సహేతుకమైన కారణాన్ని చూపించి నెగిటీవ్లోంచి కూడా పాజిటీవ్‌నెస్‌ని చూపించగలిగారు. ‘ఎన్టీఆర్’లో కనిపించనది ఇదే. ఎన్టీఆర్ మరణానికి ముందు జరిగిన ఘటనలు చూపించపోవడం స్క్రీన్ ప్లే ట్రిక్కు కావొచ్చు. కానీ.. అవన్నీ నిజాల్ని కప్పి పుచ్చడానికే అన్నది జనాల నమ్మకం. దాంతో ఈ బయోపిక్‌పై ఆసక్తి మరింత సన్నగిల్లింది.
డ్రామా మితిమరితే..?
నాటకీయత అనేది సినిమాకి చాలా అవసరం. నిజ జీవితంలో ఆ డ్రామా ఉండదు. సినిమాల కోసం కల్పించుకోవాలంతే. కానీ.. అది మరీ మితిమీరినా ప్రమాదమే. కొన్ని సన్నివేశాల్ని ఎలివేట్ చేయడానికి ఉన్నవీ, లేనివి కల్పించి.. మసిపూసి మారెడు కాయ చేసే ప్రయత్నం కూడదు. ఎందుకంటే.. బయోపిక్‌ల స్ఫూర్తిని అది దెబ్బతీస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే డాక్యుమెంటరీ అయిపోతుందని భయపడే దర్శకులు, కల్పన వైపు మొగ్గు చూపితే అది బయోపిక్ కాకుండా పోతుందన్న విషయాన్ని గ్రహించాలి. ఎన్టీఆర్ నేర్పిన మరో అతి కీలకమైన పాఠం ఇది.