మరో రెండు రోజుల్లో ‘మహానాయకుడు’ విడుదలవుతోంది. ‘కథానాయకుడు’ తో వచ్చిన నష్టాల్ని పూడ్చుకోవాలంటే ‘మహానాయకుడు’ మంచి ఓపెనింగ్స్ దక్కించుకోవాల్సిందే. కానీ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే.. అనుమానమే అని చెప్పాలి. ‘కథానాయకుడు’ విషయంలో భారీ ప్రమోషన్లు చేసింది చిత్రబృందం. నెల రోజుల ముందు నుంచీ హడావుడి మొదలెట్టేసింది. రోజుకో స్టిల్లు విడుదల చేసింది. ప్రోమో టీజర్లకైతే లెక్కేలేదు. చిత్రబృందం కూడా ఇంటర్వ్యూలు కోకొల్లలుగా ఇచ్చింది.
అయితే `మహా నాయకుడు`కి అవేం కనిపించడం లేదు. రెండు రోజుల్లో విడుదల ఉండగా.. ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు బాలయ్య. కనీసం ఇంటర్వ్యూలూ లేకుండా పోయాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఇలాంటివేం చేయలేదు. 22న వస్తోంది అని ప్రకటించి ఊరుకుంది చిత్రబృందం. దాంతో బయ్యర్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు టాక్. అవసరానికి మించి పబ్లిసిటీ చేస్తేనే `కథానాయకుడు`కి అంతంత మాత్రమే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు పబ్లిసిటీ లేకుండా `మహానాయకుడు` థియేటర్లు ఎలా నిండుతాయన్నది బయ్యర్ల ప్రశ్న. కానీ చిత్రబృందం మాత్రం మరోలా ఆలోచిస్తోంది. తొలి భాగం అంతగా ఆడలేదు కాబట్టి, ఇప్పుడు జనాలకు ఏం చెప్పినా ఓవర్గా ఉంటుందని, సినిమా చూశాకే… అందులో విషయం ఉంటే వాళ్లే ఆదరిస్తారని నమ్ముతున్నారు. టాక్ బాగుండి, మంచి ఓపెనింగ్స్ వస్తే.. అప్పుడు పబ్లిసిటీని మొదలెట్టాలని భావిస్తున్నారు. మరి ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.